రాష్ట్రంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడం మంచి నిర్ణయమేనని నరెడ్కో తెలంగాణ ప్రధాన కార్యదర్శి మేకా విజయ సాయి పేర్కొన్నారు. అక్కడ ఓ కొత్త నగరం నిర్మించే అవకాశం ప్రభుత్వానికి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు.
‘ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వల్ల కలిగే లాభనష్టాల సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వానికి ఒక కొత్త నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గొప్ప నగరాన్ని నిర్మించే అవకాశంగా దీనిని భావిస్తున్నాం. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల అక్కడి రైతులు, ప్రజలు అభివృద్ధి ఫలాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం అధికంగా వస్తుంది. జీవో తొలగింపు వల్ల వెంటనే అపార్ట్ మెంట్ రేట్లు తగ్గవు. ఇక్కడ కొత్త రోడ్లు, మౌలిక సదుపాయాల వంటివి రావాల్సి ఉంది. దీనివల్ల భూముల ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది కానీ, అపార్ట్ మెంట్ల రేట్లు తగ్గే పరిస్థితి లేదు. జలాశయాలకు నష్టం లేకుండా అభివృద్ధి చేయాలని కోర్టులు చెప్పాయి. ప్రభుత్వం వేసిన కమిటీ సూచించిన విధివిధానాలకు అనుగుణంగా ప్రభుత్వం అక్కడ చర్యలు చేపడుతుందని భావిస్తున్నాం. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి.
/
* ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా పెద్ద రోడ్లు వేయాలి. వర్షాకాలంలో చాలా ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితిని కూడా నివారించేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లా ఆ ప్రాంతానికి కూడా ఓ పేరు పెట్టాలి. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వల్ల హైరైజ్ బిల్డింగుల డిమాండ్ కూడా తగ్గదు. ఎందుకంటే వాటిని ఎక్కడ పడితే అక్కడ కట్టరు. వాటి వ్యయం కూడా ఎక్కువ. అందువల్ల వీటికి ధర ఎక్కువ వచ్చే ప్రాంతాల్లోనే నిర్మిస్తారు. భవిష్యత్తులో కొత్త ప్రాంతంలో కూడా వీటిని నిర్మించొచ్చు. అయితే, ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వల్ల హైదరాబాద్ లోని మిగిలిన ప్రాంతాల్లో రేట్లు తగ్గిపోయే అవకాశం ఇప్పటికిప్పుడు లేదు’ అని పేర్కొన్నారు.
This website uses cookies.