సస్టెయినబుల్ బిల్ట్ వాతావరణం ప్రోత్సహించడంలో ఐజీబీసీ అసాధారణ ప్రయత్నాలను చేస్తుందని మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఐజీబీసీ ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 20వ ఎడిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదాలను ప్రజలు గుర్తించాలన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు చురుగ్గా ఐజీబీసీ రేటెడ్ గ్రీన్‌బిల్డింగ్స్‌కు ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. నీటి పొదుపు పట్ల తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందన్న ఆయన భవిష్యత్తు కోసం ఇండియా నీటి పరిరక్షణ చేయాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ బిల్డింగ్ ఉద్యమంలో భాగం కావాల్సిందిగా కోరారు.
భారతదేశంలో బ్రిటీష్ హై కమిషన్‌కు ప్రాతినిధ్యం వహించడంతో పాటుగా దక్షిణాసియా డిప్యూటీ ట్రేడ్ కమిషనర్‌గా వ్యవహరిస్తోన్న అన్నా షాట్‌బోల్ట్ మాట్లాడుతూ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్, ఇండియా నడుమ జరిగిన పలు భాగస్వామ్యాలను గురించి ఆమె సదస్సుకు హాజరైన సభికులకు వెల్లడించారు. భారతదేశంలో క్లీన్ టెక్నాలజీ ప్రోత్సహించడం కోసం ఐజీబీసీతో కలిసి నూతన కార్యక్రమాన్ని యుకె ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నెట్ జీరో దిశగా యుకె ప్రయత్నాలను వెల్లడించిన ఆమె, ఇండియాతో కలిసి పని చేయనున్నామని, మరీ ముఖ్యంగా ఐజీబీసీతో కలిసి పని చేయడం ద్వారా సమగ్రంగా నెట్‌జీరో చేరుకోవడంతో పాటుగా ఇరు దేశాల సస్టెయినబుల్ గోల్స్ చేరుకోనున్నామని తెలిపారు.
హరితహారం కోసం స్వీయ అభివృద్ధి చేసిన గృహ ప్రాజెక్ట్స్ కోసం రేటింగ్ ప్రోగ్రామ్‌లలో ఒకటి ఐజీబీసీ నెస్ట్‌ను ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. ఐజీబీసీ గ్రీన్ ఫ్యాక్టరీ రేటింగ్ సిస్టమ్; ఐజీబీసీ గ్రీన్ అఫర్టబుల్ హౌసింగ్ రేటింగ్ సిస్టమ్ మరియు ఐజీబీసీ గ్రీన్ రిసార్ట్స్ రేటింగ్ వ్యవస్ధలను సైతం ఇక్కడ ప్రారంభించారు. దీనితో పాటుగా ఐజీబీసీ కాఫీ టేబుల్ బుక్ విడుదల చేశారు. పాఠశాల విద్యార్ధులు, ఆర్కిటెక్చర్ విద్యార్ధులు, పరిశ్రమలకు అవార్డులు సైతం అందజేశారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నేషనల్ ఛైర్మన్ గుర్మిత్ సింగ్ అరోరా మాట్లాడుతూ ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022 ఆసియాలో అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటంటూ 120 మంది స్పీకర్లు, 3వేల మంది డెలిగేట్లు హాజరయ్యారన్నారు. సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ మరియు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి అతిథులను స్వాగతించారు. తెలంగాణా ప్రభుత్వం ఎప్పుడూ కూడా పర్యావరణానికి చక్కటి మద్దతు అందిస్తుందంటూ తమకు భాగస్వామ్య రాష్ట్రంగా నిలువడం ఆనందంగా ఉందన్నారు. ఐజీబీసీ నేషనల్ వైస్ ఛైర్మన్ బి తైగరాజన్ ముగింపు ఉపన్యాసం అందించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తరువాత, భారతదేశపు అతిపెద్ద గ్రీన్ ఎక్స్‌పోను గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2022లో భాగంగా ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో 1000కు పైగా గ్రీన్ బిల్డింగ్ ఉత్పత్తులు, సేవలు మరియు సాంకేతికతలను 100 స్టాల్స్ ద్వారా ప్రదర్శించారు. అక్టోబర్ 20–22, 2022 మధ్య జరిగే ఈ ఎక్స్‌పోకు 10వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా.