- పాన్ ఇండియాలో 9 శాతం పెరిగిన ధరలు
- హైదరాబాద్ లో 10 శాతం పెరుగుదల
పాన్ ఇండియాలో ఇళ్ల ధరలు మరింత పెరిగాయి. 2023 నాలుగో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 9 శాతం మేర పెరిగి చదరపు అడుగుకు రూ.10,226కి చేరింది. ఈ మేరకు క్రెడాయ్, కొలియర్స్, లయాసెస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. హౌసింగ్ కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని, ముఖ్యంగా మిడ్, లగ్జరీ సెగ్మెంట్ల ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని వివరించింది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని తెలిపింది. బెంగళూరులో అత్యధికంగా 21 శాతం మేర ఇళ్ల ధరల్లో పెరుగుదల నమోదైంది.
ఔటర్ ఈస్ట్ సబ్ మార్కెట్లో ఇది ఏకంగా 42 శాతం ఉంది. బెంగళూరులో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లకు అధిక డిమాండ్ కొనసాగుతోంది. వీటి ధరలు 36 శాతం మేర పెరిగాయి. బెంగళూరు తర్వాత కోల్ కతాలో ఇళ్ల ధరలు 11 శాతం మేర పెరిగాయి. ఔటర్ కోల్ కతాలో 32 శాతం, తూర్పు కోల్ కతాలో 27 శాతం మేర ధరల్లో పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ ఇళ్ల ధరల్లో 10 శాతం పెరుగుదల నమోదైంది. అత్యధికంగా సౌత్ వెస్ట్ లో 24 శాతం మేర ఇళ్ల ధరలు పెరిగాయి. 4 బీహెచ్ కే ఇళ్లు అత్యధికంగా 14 శాతం మేర పెరగ్గా.. సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు 11 శాతం మేర పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. పుణెలో సైతం ఇళ్ల ధరలు 10 శాతం పెరిగాయి.
నగరాలవారీగా ఇళ్ల ధరలు ఎలా పెరిగాయంటే..
నగరం 2022లో సగటు ధర(చ.అ.కి. 2023లో సగటు ధర పెరుగుదల శాతం
బెంగళూరు 8,276 9,976 21%
కోల్ కతా 7,144 7,912 11%
హైదరాబాద్ 10,090 11,083 10%
పుణె 8,379 9,185 10%
అహ్మదాబాద్ 6,203 6,737 9%
ఢిల్లీ-ఎన్సీఆర్ 8,394 9,170 9%
ముంబై 19,287 20,047 4%
చెన్నై 7,445 7,701 3%