వేలం పాటల వల్ల కోకాపేట్ ఈమధ్య హాట్ లొకేషన్గా మారింది. కాకపోతే, ఈ ప్రాంతానికి గల అభివృద్ధిని ముందే అంచనా వేసిన సంస్థల్లో రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రముఖంగా నిలుస్తుంది. గత దశాబ్ద కాలంలో.. కోకాపేట్ వేదికగా చేసుకుని.. అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అందులో కొన్ని నిర్మాణాల్ని కొనుగోలుదారులకు విజయవంతంగా అప్పగించింది. అయితే, ఇటీవల హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో రాజపుష్ప ( Rajapushpa ) సంస్థ అధిక ధర వెచ్చించి సుమారు ఒకటిన్నర ఎకరాల ప్లాటును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాటు పక్కనే రాజపుష్ప సంస్థకు దాదాపు నాలుగు ఎకరాల భూమి ఉంది.
ఆ స్థలంలో కేవలం 80 అడుగుల రోడ్డు మాత్రమే వస్తుంది. అందుకే, గత్యంతరం లేక హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో అధిక రేటు వెచ్చించి ఎకరంన్నర స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలం జత కలవడంతో రాజపుష్ప సంస్థకు 100 అడుగుల రోడ్డు లభిస్తుంది. తద్వారా ఆకాశహర్మ్యం కట్టేందుకు వీలు కలుగుతుంది. మరి, ఐదున్నర ఎకరాల్లో రాజపుష్ప రాజసం ఉట్టిపడేలా.. ఎలాంటి ప్రాజెక్టుని డిజైన్ చేస్తుందో తెలియాలంటే.. మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ స్థలంలో హైదరాబాదుకే తలమానికమైన ప్రాజెక్టును రాజపుష్ప ప్లాన్ చేస్తుందని నిర్మాణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.