తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ యూడీఎస్ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించినా కొందరు సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ఆర్ఆర్ రీజియన్లోని ప్రాంతాల్లో ఈ తరహా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. అదేవిధంగా, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేటికీ ఇలాంటి అక్రమ యూడీఎస్ రిజిస్ట్రేషన్లు చోటు చేసుకుంటున్నాయని తెలిసింది. వాస్తవానికి, స్థానిక సంస్థల నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులో ఫ్లాటు కొనుగోలు చేశాక.. బిల్డర్ మరియు బయ్యర్ మధ్య రాసుకునే సేల్ అగ్రిమెంట్ లేకుండా స్థలానికి సంబంధించిన అవిభాజ్యపు వాటా (యూడీఎస్)ను రిజిస్టర్ చేయకూడదని తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది.
కొంతకాలంగా హైదరాబాద్లో యూడీఎస్ పేరిట కొందరు అక్రమార్కులు యధేచ్చగా బిల్టప్ ఏరియాను అమ్ముతున్నారు. రేటు తక్కువ అంటూ ముందే వంద శాతం సొమ్మును వసూలు చేస్తున్నారు. పైగా, వీరంతా ఈ సొమ్మును ఆయా ప్రాజెక్టు కోసం కాకుండా వేరే పనుల నిమిత్తం వినియోగిస్తున్నారు. దీంతో, అందులో కొన్నవారంతా దారుణంగా మోసపోయే ప్రమాదముంది. ఈ అంశాన్ని ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సేల్ అగ్రిమెంట్ లేకుండా యూడీఎస్ రిజిస్ట్రేషన్లను చేయకూడదని ఆదేశించింది.