- స్థిరాస్థి రంగంలో భాగ్యనగరమే నెంబర్ వన్
- ఉపాధి అవకాశాలు పెరగడంతో ఇళ్లకూ డిమాండ్
- నగరంలో రూ.50 లక్షల లోపు ఇళ్లు దొరకడమే లేదు
- స్టీల్, సిమెంట్, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల సామాన్యులకు శాపమే
- రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల జోలికెళ్లొద్దు
- యూడీఎస్ లో కొనే ముందు ఆలోచించుకోవాలి
- క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి
కరోనా మహమ్మారి తర్వాత రియల్ రంగం పుంజుకుందని.. దేశంలోని అన్ని నగరాల్లో ఈ రంగం వృద్ధి చెందుతోందని క్రెడాయ్ జాతీయ ఉపాధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం హైదరాబాద్ టాప్ లో ఉందని.. ఇక్కడున్న ఉపాధి అవకాశాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్ ధరల పెరుగుదల నిర్మాణరంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? హైదరాబాద్ లో రియల్ పరిస్థితి ఏమిటి వంటి పలు విషయాలపై ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ..
స్టీల్, సిమెంట్ రేట్ల పెరుగుదల నిర్మాణ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
దాదాపు ఏడాది నుంచి స్టీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పుడు టన్ను స్టీల్ ధర రూ.40 వేల నుంచి రూ.42 వేలు ఉండగా ఇప్పుడు రూ.65వేలకు వచ్చింది. అది కూడా సెకండరీ మార్కెట్. అదే ప్రైమరీ మార్కెట్ లో రూ.75వేలు ఉంది. చిన్న ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ఐదు టన్నుల స్టీల్ పడుతుందనుకుంటే.. ఏకంగా ఒక్క స్టీల్ కే దాదాపు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలు అదనపు వ్యయం అవుతుంది. ఇది సామాన్యులకు శాపమే.
కరోనా తర్వాత స్థిరాస్థి రంగం పుంజుకుంటున్న తరుణంలో వీటి రేట్లు ఎందుకు పెరిగాయి?
బొగ్గు కొరత వల్ల విద్యుత్ సమస్య వచ్చి ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. అది నిజమే అయినప్పటికీ.. దానివల్ల ఎంత భారం పడుతుందో అంతే పెంచడంలేదు. దీనిపై వారు ఆలోచించాలి. ఈ అంశంపై భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి ఏదైనా చేయాలి. ఇప్పటికే లేబర్ ధరలతోపాటు పీవీసీ, కాపర్, టైల్స్.. ఇలా అన్ని ధరలూ పెరిగాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు దాదాపు రూ.500 మేర పెరిగింది.
ఈ పెరిగిన వ్యయాన్ని నేరుగా కొనుగోలుదారుపైనే వేస్తారా లేక బిల్డర్లు కొంత భరిస్తారా?
కొనుగోలుదారులపై ఒకేసారి అంత భారం మోపితే అమ్మడం కష్టం. ఇప్పటికే భూముల ధరలు పెరిగాయి. ఇక నిర్మాణ వ్యయం కూడా పెంచితే చదరపు అడుగు రూ.4వేలు ఉన్న ధరను రూ.7వేలు అమ్మాలి. కానీ అది సులభం కాదు. ఈ నేపథ్యంలో కొంత బిల్డర్ భరించక తప్పదు.
సిమెంట్, స్టీల్ రేట్ల పెరుగుదల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా?
చాలాసార్లు తీసుకెళ్లాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించాం. ప్రతిసారీ హామీలు వస్తున్నా.. అమలుకావడంలేదు. స్టీల్, సిమెంట్ కి ప్రత్యామ్నాయంవైపు వెళ్లాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పారు.
స్టీల్, సిమెంట్ కి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా?
ప్రత్యామ్నాయం అంత సులభం కాదు. నిజానికి చాలా ఉన్నాయి. ఆప్టిక్ ఫైబర్ లోగానీ, వుడెన్ లో గానీ స్టీల్ కి ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. కానీ వీటికి కొంత సమయం పడుతుంది. ఇంధన ధరలు విపరీతంగా పెరగడం కూడా నిర్మాణరంగం ప్రభావితం కావడానికి మరో కారణం.
ఏయే సామగ్రి ఎంత మేర పెరిగింది?
దాదాపు అన్ని వస్తువులూ పెరిగాయి. టైల్స్ రూ.40 ఉండేవి.. ఇప్పుడు రూ.55కి పెరిగింది. అలాగే పీవీసీ 40 శాతం, కాపర్ 40 శాతం.. ఇలా ఎలక్ట్రికల్, శానిటరీ అన్ని ధరలూ పెరిగాయి.
హైదరాబాద్ లో మాత్రమే ధరలు పెరగడానికి కారణమేంటి?
భారతదేశంలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉంది. ప్రభుత్వం తీసుకున్న సానుకూల చర్యలే ఇందుకు కారణం. హెల్త్ విషయంలో కూడా టాప్ లో ఉన్నాం. కరోనా సమయంలో ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి చికిత్స పొందారు. అలాగే ఐటీ రంగంలో కూడా మంచి వృద్ధి నమోదైంది. దీనివల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. పెట్టుబడుదారులు కూడా పెరుగుతున్నారు. ఫలితంగా ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది.
ఇళ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి?
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ చాలా బాగుంది. అయితే, కొనుగోలుదారులకు ఒకటి చెప్పాలి. ప్రీ సేల్స్, ముఖ్యంగా యూడీఎస్ సేల్స్ అని చాలామంది కొంటున్నారు. అయితే ఆ డెవలపర్ల గురించి తెలుసుకోకుండా, వారికి ఆ ప్రాజెక్టు పూర్తి చేయగల సత్తా ఉందా లేదా అని చూడకుండా కొనడం మంచిది కాదు. అలాంటివి ఇప్పుడు తక్కువకు వస్తున్నాయని కొనుక్కుంటున్నారు. అయితే, ఆ ప్రాజెక్టు లాంచ్ అయిన తర్వాత మార్కెట్ రేటుకు అమ్మాల్సి వస్తుంది. లేకుంటే నిర్మాణ వ్యయానికి కూడా సరిపోదు. ఇప్పుడు తక్కువ ధరకు కాబట్టి అమ్ముకోగలుగుతున్నారు. కానీ ప్రాజెక్టు లాంచ్ అయిన తర్వాత ఇతర బిల్డర్లకు తగ్గట్టుగా అమ్మాల్సి ఉంటుంది. అలా చేయగలుగుతారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తికాకపోతే అందులో కొనుక్కున్నవారి పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితి ఢిల్లీలో జరిగింది. తొమ్మిదేళ్లు, పదేళ్లపాటు కూడా ప్రాజెక్టులను డెలివరీ చేయని వేల అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఎంతోమంది డెవలపర్లు జైళ్లలో ఉన్నారు. అందువల్ల కొనుగోలుదారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందిపడొద్దు. రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టొద్దు.
అందుబాటు ధరలో.. అంటే రూ.45 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు తగ్గడానికి కారణమేంటి?
రూ.45 లక్షల లోపు ధర ఉన్న ఇళ్ల అమ్మకాలు తగ్గడం అనేది లేదు. కాకపోతే రూ.45 లక్షల్లో అపార్ట్ మెంట్స్ రావడం కస్టమవుతోంది. ప్రస్తుతం ఆ రేటులో లేవు. 60 నుంచి 70 చదరపు మీటర్ల ఇళ్లు ప్రైమ్ ఏరియాలో ఉండటంలేదు. నగరానికి పది లేదా 15 కిలోమీటర్ల దూరం వెళితేనే అవి దొరుకుతాయి. రూ.50 లక్షల కంటే తక్కువ ప్రాపర్టీలు సిటీలో ఎక్కడా దొరకవు. ఇక విల్లాలకు మంచి డిమాండ్ ఉంది.
కమర్షియల్ స్పేస్ డిమాండ్ ఎలా ఉంది?
కమర్షియల్ స్పేస్ కు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏటా దాదాపు 2 కోట్ల చదరపు అడుగుల మేర లీజు జరుగుతోందని అంటున్నారు. దేశంలో ఎక్కడ చూసినా హైదరాబాద్ బావుందని చెబుతున్నారు. ఒకప్పుడు బెంగళూరు టాప్ లో ఉండేది. ఇప్పుడు కూడా బెంగళూరే టాప్ అయినప్పటికీ.. మనకు బెంగళూరుకు మధ్య గ్యాప్ తగ్గుతూ వస్తోంది. రియల్ వృద్ధిలో మనం బెంగళూరు కంటే ముందున్నాం.
దేశంలోని మెట్రో సిటీలను తీసుకుంటే ఏఏ నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది?
నెంబర్ వన్ హైదరాబాద్.. తర్వాత పుణె ఉంది. ఆ తర్వాత బెంగళూరు, ముంబై ఉన్నాయి. ఢిల్లీ కూడా గాడిలో పడింది. అహ్మదాబాద్ లో కూడా బావుంది. కరోనా మహమ్మారి తర్వాత ఒక్కో నగరం నెమ్మదిగా వృద్ధి చెందుతోంది. కరోనా కంటే ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు ప్రతిచోటా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోంది.