- నగరంపై ఆర్థిక సంస్థలకు ఎనలేని విశ్వాసం
- రుణమిచ్చిన ఆదిత్యా బిర్లా, టాటా క్యాపిటల్..
- జూన్ తర్వాత నుంచి మార్కెట్ మెరుగు
- ఏషియా పసిఫిక్ ఎండీ రాధాక్రిష్ణ
గత సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మార్చి దాకా హైదరాబాద్లోని పద్దెనిమిది నిర్మాణ సంస్థలకు దాదాపు ఏడు వందల కోట్ల రుణాన్ని మంజూరు చేయించామని ఏషియా పసిఫిక్ ఎండీ రాధాక్రిష్ణ తెలిపారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మార్కెట్లో కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పటికీ, అది కేవలం తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు. మే 1 నుంచి పద్దెనిమిదేళ్లు దాటిన వారికీ కరోనా టీకా అందజేయడం వల్ల.. జూన్ తర్వాత నుంచి మార్కెట్లో మళ్లీ సానుకూల వాతావరణం నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇంకా, ఏమన్నారో ఆయన మాటల్లోనే..
బజాజ్, టాటా క్యాపీటల్, ఆదిత్యా బిర్లా, డీసీబీ వంటి అనేక సంస్థలకు హైదరాబాద్ నిర్మాణ రంగంపై ఎక్కడ్లేని విశ్వాసం నెలకొంది. వీరిలో ఆ విశ్వాసం నెలకొనడానికి గతేడాది మే నెలలోనే నగరంలో నిర్మాణ పనుల్ని జరుపుకుంటున్న అనేక ప్రాజెక్టుల్ని స్వయంగా చూపించాం. కొవిడ్ రోజుల్ని లెక్క చేయకుండా అక్కడ జరిగే పనుల్ని స్వయంగా చూశాక ఆయా ఆర్థిక సంస్థల ప్రతినిధుల్లో ఎక్కడ్లేని విశ్వాసం ఏర్పడింది. అందుకే, ఏప్రిల్ మొదటి వారం దాకా బడా బడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నీ హైదరాబాద్లోనే మకాం వేశాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్నుంచి మన హైదరాబాద్ వచ్చి రుణాల్ని మంజూరు చేసేవారు. ఆదిత్యా బిర్లా సంస్థ చాలా రోజుల తర్వాత రుణం మంజూరు చేసింది. డీసీబీ కూడా అంతే. బజాజ్ కంపెనీ, టాటాలు వంటివి అధిక మొత్తంలో రుణమిచ్చాయి. ఇవి మంజూరు చేసే రుణాలపై సుమారు 11 నుంచి 15 శాతం దాకా వడ్డీ ఉంటుంది.
కొత్త వారికి రుణమిస్తారా?
ఆర్థిక సంస్థలు రుణాన్ని మంజూరు చేసేటప్పుడు డెవలపర్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వారు ఇంతవరకూ చేపట్టిన నిర్మాణాల్ని గమనిస్తాయి. ఒక బిల్డర్ కనీసం రెండు లక్షల చదరపు అడుగుల్లోపు నిర్మాణాల్ని చేపట్టారా? లేదా? అనే అంశాన్ని గమనిస్తాయి. ఒకవేళ బిల్డర్ కొత్త అయినా, అతనితో కలిసి ఉన్న భాగస్వామ్యుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. వీటితో బాటు ప్రస్తుతం కడుతున్న ప్రాజెక్టు ప్రాంతాన్ని క్షుణ్నంగా గమనిస్తాయి. ఆయా ప్రాంతంలో బిల్డర్ అపార్టుమెంట్ కడితే ఫ్లాట్లను అమ్మగలడా? నెలకు ఎన్ని విక్రయించగలడు? అక్కడ ఇతర ఏయే సంస్థలు నిర్మాణాల్ని ప్రారంభించాయి? వంటి విషయాలపై లోతుగా అధ్యయనం చేస్తాయి.
ఇరవై ఏళ్ల అనుభవం..
దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఇదే రంగంలో ఉండటం వల్ల మా అనుభవం అటు రుణమిచ్చే సంస్థకు, తీసుకునే కంపెనీకి ఉపయోగపడుతుంది. ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే రెండు, మూడేళ్లు కష్టపడాలి. ఈమధ్యకాలంలో అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కో క్వార్టర్ అమ్మకాలు తక్కువ ఉండొచ్చు.. కొనుగోలుదారుల నుంచి క్యాష్ ఫ్లో పెద్దగా ఉండకపోవచ్చు.. అయినప్పటికీ, బ్యాంకులు నిధుల మంజూరును నిలిపివేయకూడదు. ఇలాంటి అంశాల్ని మేం అధ్యయనం చేసి ఇరువురికి అర్థమయ్యేలా ముందే వివరిస్తాం. దీంతో ఇరువురికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా తోడ్పాటును అందిస్తాం.
జూన్ తర్వాత ఓకే..
సెకండ్ వేవ్ వల్ల ఏప్రిల్ రెండో వారం నుంచి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. మే మొదట్నుంచి ఎలాగూ 18 ఏళ్లు దాటిన వారికి కరోనా వాక్సీన్ అందజేస్తున్నారు కాబట్టి అధిక శాతం మందికి కరోనా నుంచి రక్షణ లభిస్తుంది. గతేడాది కంటే ఇప్పుడు కరోనా తీవ్రత పెరిగినప్పటికీ వాక్సీన్ అందుబాటులో ఉండటం వల్ల భయపడనక్కర్లేదు.