భారత్ లోని రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం లేదని క్రెడాయ్ పేర్కొంది. స్థిరాస్తి కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతున్నాయని, పండగ తర్వాత కూడా అమ్మకాలు అలాగే కొనసాగుతాయని భావిస్తున్నట్టు వెల్లడించింది. రాబోయే నెలల్లో కేసులు పెరిగితే తప్ప.. అప్పటివరకు నిర్మాణ రంగ కార్యకలాపాలు, డెలివరీల్లో ఎలాంటి ఆటంకాలూ కలగబోవని అనుకుంటున్నట్టు తెలిపింది. ‘గత రెండు వేవ్ లలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని డెవలపర్లు సైతం అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నారు. సరఫరా చైన్ తోపాటు లేబర్ సరఫరా విషయంలో కూడా ఎలాంటి సమస్యలూ లేకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాలు యథాతథంగా సాగుతాయి.
అందువల్ల గృహ కొనుగోలుదారులకు తాము అనుకున్న సమయానికి కొత్త ఇళ్లలోకి వెళ్లొచ్చు. అలాగే కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలపై కూడా ఎలాంటి ప్రభావం ఉండదు’’ అని క్రెడాయ్ అధ్యక్షుడు హర్షవర్థన్ పటోడియా పేర్కొన్నారు. అయితే, ఒకవేళ ఒమిక్రాన్ కారణంగా ఏవైనా లాక్ డౌన్లు లేదా కర్ఫ్యూలు విధిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోతే అది ఆ రంగంలోని కార్మికులతోపాటు ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రదేశాలు, ఆయా కార్యాలయాల్లో కోవిడ్ నిరోధక చర్యలు చేపట్టినట్టు వివరించారు.