- ట్రెడా చీఫ్ అడ్వైజర్ పీఎస్ రెడ్డి
- జమ్మూలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ల సమ్మిట్
- కశ్మీరులో పుంజుకుంటున్న రియల్ రంగం
- స్థలం కొంటే.. 24 గంటల్లో పనులు షురూ!
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
జమ్మూ కాశ్మీర్ అంటే భూతలస్వర్గమే. జీవితంలో ఒక్కసారైనా కశ్మీరు అందాల్ని కళ్లారా వీక్షించాలని కోరుకునేవారి శాతం ఎక్కువే ఉంటుంది. అయితే, అక్కడ సొంతంగా ఇల్లు కూడా కొనుక్కునే అవకాశం మన ముంగిట్లోకి వచ్చేసింది. ముఖ్యంగా, జమ్మూలో ఈ అవకాశమున్నదని.. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నదని ట్రెడా చీఫ్ అడ్వైజర్ పీఎస్ రెడ్డి తెలిపారు. ఇటీవల జమ్మూలో జరిగిన జమ్మూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీరులో రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురు పాఠకులకు వివరించారు. సారాంశం ఆయన మాటల్లోనే..
జమ్ములో ఎకరం స్థలం ధర రూ.24 కోట్లు పలుకుతోంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చాలా గట్టి వ్యక్తి.. అక్కడ టెనెన్సీ చట్టాన్ని ఒక రోజులో తొలగించారు. ఇంధనం మీద జీఎస్టీని ఒక శాతం చేశారు. ఇళ్లపై స్టాంప్ డ్యూటీ తగ్గించమంటే సానుకూలంగా స్పందించారు. జీఎస్టీ తగ్గింపును వర్తింపజేస్తానని మాటిచ్చారని తెలిపారు. అక్కడ ఆర్థిక అభివృద్ధి సాధ్యమైతేనే స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఫలితంగా తీవ్రవాదం అంతం అవుతుందని ఆయన భావిస్తున్నారు. కాశ్మీరులో ప్రవేశపెట్టిన కొత్త అభివృద్ధి చట్టం ప్రకారం.. అక్కడ వ్యవసాయేతర భూమిని దేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవారైనా కొనుగోలు చేయవచ్చు. గతంలో ఇలాంటి వెసులుబాటు ఉండేది కాదు. కొత్త చట్టం వల్ల కాశ్మీరులో రెండో గృహాలకు, వేసవి గృహాలకు క్రమక్రమంగా గిరాకీ పెరుగుతోంది.
సాధారణంగా భూముల ధరలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లోనే ఎక్కువగా ఉంటాయని భావిస్తాం. జమ్మూలోనూ స్థలాల ధరలు తక్కువేం లేవు. ఇక్కడ కమర్షియల్ ప్లాటు కొనాలంటే.. ఎకరానికి రూ.24 కోట్ల దాకా పెట్టాల్సి ఉంటుంది. అసలింత ధర ఉంటుందనే విషయాన్ని ఎప్పుడూ ఊహించలేదు. పదిహేనేళ్ల క్రితం చూసి జమ్మూకి ప్రస్తుతమున్న నగరానికెంతో తేడా ఉంది. యూరప్‌లోని నగరాలకు ఏమాత్రం తక్కువ కాకుండా జమ్మూ డెవలప్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు జమ్మూలో ఇతరులు భూముల్ని కొనే అవకాశం ఉండేది కాదు. కానీ తాజాగా ప్రవేశపెట్టిన జమ్మూ కాశ్మీరు డెవలప్‌మెంట్ చట్టం ప్రకారం భారతదేశానికి చెందిన వారెవ్వరైనా జమ్మూలో వ్యవసాయేతర భూముల (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ )ను కొనుగోలు చేసే అవకాశం లభించింది. దీంతో, చాలామంది పెట్టుబడిదారులు జమ్మూలో భూముల్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కాశ్మీరులో రియల్ రంగానికి ఎక్కడ్లేని ఆదరణ పెరుగుతోంది. ఇందుకు అక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధియే ప్రధాన కారణం. గతంలో శ్రీనగర్ నుంచి జమ్మూకి వెళ్లాలంటే 14 నుంచి 15 గంటలు పట్టేది. తాజాగా అభివృద్ధి చేసిన ఫ్లయ్ ఓవర్లు, రహదారి వల్ల ఐదు గంటల్లో చేరుకోవచ్చు. అక్కడ అపార్టుమెంట్ నిర్మించేందుకు ఈ రోజు స్థలం కొనేసి.. రేపు నిర్మాణ పనులు మొదలెట్టొచ్చు. ఆ రహదారి మీద నుంచే కాట్రాలోని వైష్ణో దేవాలయానికి వెళ్లొచ్చు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింకు ప్రాజెక్టు, జమ్మూ, శ్రీనగర్ విస్తరణ, ఢిల్లీ- అమృత్‌సర్, కాట్రా ఎక్స్‌ప్రెస్ వే, ట్విన్ మెడి సిటీస్, ఎయిమ్స్, ఐఎంఎస్, స్మార్ట్ సిటీ, ఐటీ పార్కులు వంటివి అభివృద్ధి చెందడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.’
‘