- రియల్ ఎస్టేట్ గురుతో నటుడు సిద్ధూ జొన్నలగడ్డ
సిద్ధూ జొన్నలగడ్డ.. గుంటూరు టాకీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ కథనాయకుడు ప్రస్తుతం తాను నటించిన డీజే టిల్లు సినిమా విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన రాగా, సినిమా కూడా విజయవంతం అవుతుందనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన కలల ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు రియల్ ఎస్టేట్ గురు ఆయన్ను సంప్రదించింది. ప్రస్తుతానికి తనకు హైదరాబాద్ లో సొంత ఇల్లు లేదని, అది ఎప్పుడు సాకారమైనా అది తనకు ఎంతో విలువైనది అవుతుందని వెల్లడించారు.
‘నా కాలల సౌథం సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించేదిగా ఉంటుంది. నా సామాజిక స్థితిని ప్రదర్శించడానికి నేను ఇల్లు కొనుక్కోను. నేను రిలాక్స్ అవడం కోసమే ఇల్లు కావాలి. నాకు పెద్ద ఇళ్లంటే చాలా ఇష్టం. ఎవరైనా బాల్యం గురించి మాట్లాడితే.. వెంటనే నా ఆలోచనలు పద్మారావునగర్ కి వెళ్లిపోతాయి. అక్కడి ఇంట్లో నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి.
ఎంతో హాయిగా, చిన్నచిన్న వసతులతో ఉన్న ఆ ఇంటి పరిమళం నేను ఎప్పటికీ మరచిపోను. పాత ఇంటి అందం అంత బాగుంటుంది. అంతేకాదు.. వారాసిగూడ, చిలకలగూడలోని యువకులు హైదరాబాదీ తెలంగాణ యాసలో మాట్లాడటం బాగుంటుంది. ఇక అక్కడ ప్రతి వీధిలోనూ గ్యాంగులు.. ఆ పోటీలు మామూలే. అక్కడి అబ్బాయిలు కూడా బంజారాహిల్స్ అబ్బాయిల కంటే చాలా చలాకీగా ఉంటారు’ అని సిద్ధూ అక్కడి సంగతులు గుర్తు చేసుకున్నారు.
చాలామందికి తగిన పరిమాణంలో ఉండే ఇల్లు సరిపోతుండగా.. తనకు మాత్రం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అపరిమిత అంచనాలకు తగినట్టుగా ఉండే పెద్ద ఆడంబరమైన ఇల్లు కావాలని చెప్పారు. అలాడే డెకరేషన్ విషయానికొస్తే అత్యంత విలాసవంతంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ‘నా గదిలో కొంత నాటకీయత ఉండాలని కోరుకుంటున్నాను. విభిన్నంగా ఉండాలంటే ధైర్యం అవసరం. గదిలో ఒకే రకమైన రంగు ఉంటే బోర్ కొడుతుంది.
అలా కాకుండా కొన్ని రకాల రంగులు ఉంటే మన మూడ్ ని చక్కగా ఉంచడానికి సహాయపడతాయి లేదా ఓ చక్కని వాతావరణానికి తీసుకెళ్తాయి. ఇక కిటికీలను స్మార్ట్ గా, సొగసైనవిగా చేస్తే అవి ఎంత బాగుంటాయో ఆలోచించండి. ఇదంతా నా ఐడియానే అని నా స్నేహితులకు చెప్పి ఆనందిస్తే ఆ మజాయే వేరు. నాకు ఇష్టమైన లేదా నాటకీయమైన వస్తువులను గోడలను అలంకరించడానికి ఎందుకు ప్రయత్నించకూడదు’ అని సిద్ధూ ప్రశ్నించారు.
ప్రపంచంలో ఉన్న డబ్బంతా సిద్దూ దగ్గర ఉంటే ఏం చేస్తాడో తెలుసా? ‘నా కలల సౌథాన్ని నిర్మించడంలో సహాయపడటానికి దేశంలోనే అత్యుత్తమ ఇంటీరియర్ డిజైనర్ ని నియమించుకుంటాను. వారి నైపుణ్యంతో ఏం చేస్తారో చూడటం బావుంటుంది. సరళత, నైపుణ్యం, సొగసైన కార్యాచరణ, నాణ్యమైన మెటీరియల్స్ ను ఒకటిగా కలపడంలో వారు ఎంతో ప్రసిద్ధి’ అని వివరించారు. మరి అందమైన పెద్ద విల్లాను ఎక్కడ నిర్మించుకోవాలని భావిస్తున్నారు అని అడగ్గా.. ‘అందమైన వీక్షణలు, పొగ మంచుతో నిండిన హిల్ స్టేషన్లు ప్రతి ఒక్కరి కలల ఇంటి జాబితాలో ఉంటాయి.
నాకు కూడా అదే ఉంది. నా బంగ్లాను హిల్ స్టేషన్ లోనే నిర్మించాలనుకుంటున్నాను. అస్తవ్యస్తమైన నగర జీవితం, మండుతున్న వేడి నుంచి తప్పించుకోవడానికి కచ్చితమైన ప్రదేశాలు అవే. కొండ కోనలు నగర జీవితం ఇవ్వలేని ప్రశాంతతను అందిస్తాయి’ అని సిద్దూ వెల్లడించారు. వాస్తవానికి తన కలలు ఇల్లు అలా ఉండాలని చెప్పిన సిద్దూ.. ఆచరణాత్మకంగా వచ్చే సరికి కాస్త వెసులుబాటు తీసుకుని, ఓ బహుళ అంతస్తుల భవనంలో పెంట్ హౌస్ ఉన్నా బాగుంటుందని చెప్పి ముగించారు.