మాదాపూర్ లోని హైటెక్ సిటీకి అతి చేరువగా ఉన్న ప్రాంతాల్లో బాచుపల్లి ప్రముఖంగా నిలుస్తుంది. ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ గా ఖ్యాతికెక్కింది. అంతర్జాతీయ స్కూళ్లు, కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలకు కొదవే లేదీ ప్రాంతంలో. మియాపూర్ మెట్రో పుణ్యమా అంటూ బాచుపల్లి, మల్లంపేట్, బౌరంపేట్ వరకూ అపార్టుమెంట్లు, విల్లాలకు గిరాకీ ఏర్పడింది. కాకపోతే, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ముందు ఒకే ఒక అంశం గురించి క్షుణ్నంగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయాలి.
బాచుపల్లి అంటే ఒకప్పుడు శివారు ప్రాంతం. కానీ, నేడో ఇదే ఓ ప్రాముఖ్యమైన ప్రాంతం. అపార్టుమెంట్ల, విల్లాలు, పలు వ్యక్తిగత ఇళ్లలో ఈ ప్రాంతమంతా నిత్యం కళకళలాడుతుంది. మాదాపూర్, గచ్చిబౌలి ఐటీ కారిడార్లకు చేరువగా ఉండటం.. నివసించడానికి అనుకూలంగా ఉండటంతో.. ఐటీ, ఐటీఈఎస్ నిపుణులు ఈ ప్రాంతం మీద దృష్టి సారించారు. బాచుపల్లి నుంచి గచ్చిబౌలి ఐటీ కారిడార్ కు క్రమం తప్పకుండా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి.
ఇక్కడ్నుంచి హఫీట్ పేట్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజీవ్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే.. సుమారు నలభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి చేరువలోనే జేఎన్టీయూ, మియాపూర్ వద్ద ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులుంటాయి.
గుర్తుంచుకోండి..
బాచుపల్లి, మల్లంపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలుండటం.. అందులోని పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం విడుదల అవుతూనే ఉంటుంది. దీని వల్ల ఇక్కడ నివసించే ప్రజలకు రాత్రి కాగానే ఘాటైన వాసనలు ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి బాచుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు ఈ అంశాన్ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కొనాలని అనుకున్న అపార్టుమెంట్ కానీ విల్లా చుట్టుపక్కల నివసించేవారిని ఈ కాలుష్యం గురించి విచారించాకే అడుగు ముందుకేయండి. ఎలాంటి సమస్య లేదని నిర్థారించుకున్నాకే తుది నిర్ణయానికి రండి. రాష్ట్రంలో ఎక్కడా లేనన్నీ ఫిర్యాదులు ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచే వస్తున్నాయి. ఏడాదిలో కనీసం 500 దాకా ఫిర్యాదులొస్తాయి. వాయు కాలుష్య సమస్య నివారణకు సర్వే జరుగుతోందని పీసీబీ ఈఈ రవికుమార్ తెలిపారు.