హైదరాబాద్ నిర్మాణ రంగంలో మై హోమ్ గ్రూప్ మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నది. తామెందుకు ఈ రంగంలో లీడర్లమో చాటి చెప్పింది. తెల్లాపూర్‌లోని మై హోమ్ సయూక్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మొదటి రోజే.. దాదాపు వెయ్యి ఫ్లాట్లను అమ్మి.. తగ్గేదెలే అంటూ ముందుకు దూసుకెళుతోంది. ఈ విషయాన్ని స్వయంగా టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో చెప్పడం విశేషం. ఆయన మై హోమ్ గ్రూప్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ముప్పయ్ ఐదు సంవత్సరాలు తగ్గేదెలే అన్నట్లు బిజినెస్ చేశారని ప్రశంసించారు.
మై హోమ్ సయూక్ ప్రాజెక్టు బ్రోచర్ చూస్తే.. నగరంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టు అని అర్థమైందని అల్లు అర్జున్ అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 12 భవనాలు, ప్రతి టవర్ 40 అంతస్తుల హైట్.. 1 లక్ష కంటే ఎక్కువ విస్తీర్ణంలో క్లబ్ హౌజ్.. ప్రపంచ స్థాయి సౌకర్యాల్ని కల్పిస్తున్నారని తెలిసింది. మై హోమ్ ఎలాంటి నిర్మాణాల్ని చేపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. మాదాపూర్‌లో మై హోమ్ కట్టిన ప్రాజెక్టులో తనకో ఫ్లాటు ఉందని.. లోపలికి వెళితే దుబాయో.. సింగపూరుకో వెళ్లినట్లు ఉంటుందని తెలిపారు. ఇలాంటి స్ట్రక్చర్లను చూస్తే.. హైదరాబాదు నిర్మాణ రంగం స్థాయి పెరుగుతోందని.. వీటి ద్వారా హైదరాబాద్ క్వాలిటీ అధికమవుతోందని చెప్పొచ్చన్నారు. మిగతా ప్రాజెక్టుల కంటే ఏమాత్రం తగ్గేదెలే అన్నట్టుగా నిర్మిస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.
సరికొత్త రికార్డు
2016లో మై హోమ్ అవతార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నాడే వెయ్యి ఫ్లాట్లను విక్రయించి మై హోమ్ రికార్డు సృష్టించింది. తాజాగా, మళ్లీ మై హోమ్ సంస్థే తమ రికార్డును తిరగరాసింది. సయూక్ ప్రారంభించిన 24 గంటల్లోనే 1125 ఫ్లాట్లను విక్రయించామని సంస్థ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. వీటి విలువ ఎంతలేదన్నా రూ.1800 కోట్ల దాకా ఉంటుందని వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ జూపల్లి శ్యామ్ రావు మాట్లాడుతూ.. దీన్ని రికార్డుగా పరిగణించడం కంటే.. కొనుగోలుదారులు తమపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని భావిస్తామన్నారు. మొదటి రోజు ఊహించిన దాని కంటే అధిక స్పందన వచ్చిందని.. అందుకే, అధిక నాణ్యతతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.