2020 డిసెంబరు 31తో భవనాల క్రమబద్ధీకరణ పథకం పూర్తయిన నేపథ్యంలో.. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లు కలిసి అక్రమ నిర్మాణాల వేటలో నిమగ్నమయ్యాయి.
2015 తర్వాత విజయవాడ రియల్ ఎస్టేట్ హబ్ గా మారింది. అనేక మంది బిల్డర్లు పంచాయతీ అనుమతుల్ని తీసుకుని అపార్టుమెంట్లను నిర్మించారు. ఇవి తక్కువ ధరకు రావడంతో అధిక శాతం మంది ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. అయితే, అప్పటి ప్రభుత్వం అక్రమ నిర్మాణాల్ని క్రమబద్ధీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం 2020 డిసెంబరు వరకూ కొనసాగింది.
కాకపోతే, అధిక శాతం మంది బిల్డర్లు, ఫ్లాట్ యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదు. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుపుకోలేదు. పైగా, అనుమతి గడువు కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో అమరావతి అథారిటీ, వీఎంసీలు కూల్చివేతలు జరిపేందుకు రెండు నెలల గడువునిచ్చాయి. కాకపోతే, అధిక శాతం ప్లాటు యజమానులు వీటిలో తమ కష్టార్జితాన్ని మదుపు చేశారు. అక్రమ నిర్మాణాల గురించి తెలుసుకుని బీపీఎస్ కోసం రూ.10,000 ఆరంభంలో చెల్లించారు. మిగతా సొమ్మును ఆయా ప్లాట్లలో అపార్టుమెంట్లను నిర్మించే బిల్డర్లు కడతారని భావించారు. కాకపోతే, వారు కట్టలేదనే విషయం అమరావతి రీజియన్ అథారిటీ నోటీసులిచ్చాకే తెలిసిందని చాలామంది గగ్గోలు పెడుతున్నారు. తమకు మరోసారి బీపీఎస్ నిమిత్తం అవకాశమివ్వాలని కోరుతున్నారు.