- నిర్మాణ వ్యయం పెరగడంతో పెరిగిన ధరలు
- భూమి ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు సైతం పెంపు
- ఫలితంగా తగ్గిన అమ్మకాలు
కరోనా మహమ్మారి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుని గాడిన పడినప్పటికీ, హైదరాబాద్ లో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా ప్రాజెక్టులు ఇంకా నిర్మాణంలోనే ఉన్నందును అమ్ముడుపోని రెసిడెన్షియల్ ఇన్వెంటరీ 50 శాతానికి పైగా ఉండటమే ఇందుకు నిదర్శనం. క్రెడాయ్, కొలియర్స్, లయసెస్ ఫాస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లో కొత్త ప్రాజెక్టుల లాంచ్ ఊపందుకున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్ముడు కానీ ఇన్వెంటరీ 55 శాతం ఉందని నివేదికలో తేలింది. అమ్ముడుపోని రెసిడెన్షియల్ యూనిట్లు 96 శాతం నిర్మాణంలో ఉన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్, అహ్మదాబాద్ మినహా మిగిలిన నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీ తగ్గినట్టు నివేదిక పేర్కొంది.
గతేడాది నిర్మాణ వ్యయం పెరగడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, భూమి ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో చాలా ఇళ్లు నిర్మాణంలోనే ఉండిపోగా, పూర్తయిన ఇళ్లు కూడా అమ్ముడు కావట్లేదు. ఫలితంగా అమ్ముడుపోని ఇన్వెంటరీ పెరుగుతోంది. అంతేకాకుండా హైదరాబాద్ శివార్లలో సైతం 2 బీహెచ్ కే ఫ్లాట్ ధర రూ.50 లక్షలకు తక్కువ ఉండటం లేదు. ఫ్లాట్ల ధరలు దాదాపు రూ.10 లక్షల మేర పెరగడంతో చాలామంది అంత వెచ్చించలేకపోతున్నారని తెలంగాణ రియల్టర్ల సంఘం అధ్యక్షుడు ఎన్. ప్రవీణ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు టెక్నాలజీ రంగం ఉద్యోగుల నుంచి ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో కొత్త ప్రాజెక్టులు కూడా బాగానే వచ్చాయి. ఇక హైదరాబాద్ నైరుతి ప్రాంతంలో ఇళ్ల ధరలు 15 శాతం మేర పెరిగాయి. మొత్తమ్మీద హైదరాబాద్ లో గృహాల ధరలు ఎనిమిది శాతం ఎక్కువయ్యాయి.