ప్రముఖ ఫార్మా కంపెనీ ఎరిస్ లైఫ్ సైన్సెస్ సీఎండీ అమిత్ బక్షి ముంబై వర్లీలో విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. నిర్మాణం పూర్తి కావొచ్చిన ఓ సూపర్ లగ్జరీ సీ వ్యూ అపార్ట్ మెంట్ ను రూ.61 కోట్లకు కొనుగోలు చేశారు. ఓబెరాయ్ రియాల్టీకి చెందిన ఒయాసిస్ రియల్టీ నిర్మిస్తున్న భారీ ఆకాశహర్య్మంలోని 46వ అంతస్తులో 6450 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. ఈ ఏడాది దేశంలో జరిగిన భారీ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ డీల్స్ లో ఇదే అతిపెద్దది కావడం విశేషం.
ఫ్లాట్ కొనుగోలుకు సంబంధించి స్టాంపు డ్యూటీ కింద రూ.3.66 కోట్లు చెల్లించారు. ఈనెల 6న ఈ లావాదేవీ పూర్తయింది. ఫ్లాట్ లో భాగంగా బక్షికి మూడు కారు పార్కింగ్ స్లాట్లు కూడా వస్తాయి. కాగా, ఇంతకుముందు ఇదే ప్రాజెక్టులో డబీర్ వాలా కుటుంబానికి చెందిన ఐజీఈ ఇండియా రెండు సూపర్ లగ్జరీ సీ వ్యూ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లను రూ.151 కోట్లకు కొనుగోలు చేసింది. 42, 43వ అంతస్తుల్లోని ఫ్లాట్లను ఆ కంపెనీ తీసుకుంది.