-
క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్‌రెడ్డి
-
హైదరాబాద్లో ఇదో సరికొత్త రికార్డు
-
మౌలిక పెరుగుదల.. అధికమైన గిరాకీ
మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా.. పలు దేశ, విదేశీ సంస్థలు 2022లో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల్ని పెట్టాయి. నిన్న కాక మొన్న జపాన్‌కు చెందిన రెండు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. లాజిస్టిక్స్‌లో ఆటోమేషన్ సంస్థ అయిన డైఫుకూ తెలంగాణ రాష్ట్రంలో రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టడం వల్ల సుమారు 800 మందికి పైగా ఉపాధి లభిస్తుంది. నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ అనే సంస్థ మూడో ఉత్పత్తి కేంద్రాన్ని సుమారు రూ.126 కోట్లతో తెలంగాణలో పెడుతోంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యాయి. ఇలాంటివన్నీ రియల్ రంగానికి ఊతమిచ్చే అంశాలే. 2022లో ఇళ్ల అమ్మకాలూ గణనీయంగా పెరిగాయి. ఎంతలేదన్నా యాభై వేల దాకా ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఇది హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు.
రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకూ మెట్రో ఏర్పాటు చేయడం నిర్మాణ రంగానికి ఊతమిచ్చే నిర్ణయం. దీని వల్ల మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు వంటి ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. నార్సింగి, అప్పాజంక్షన్, రాజేంద్రనగర్, మంచిరేవుల, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో కనెక్టివిటీ పెరగడం వల్ల ఇళ్లకు గిరాకీ పెరుగుతుంది. పైగా, ఓఆర్ఆర్‌తో పాటు సర్వీస్ రోడ్డు మీద ట్రాఫిక్ కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కొత్త ఫ్లయ్ఓవర్లు, సరికొత్త లింక్ రోడ్డులు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి చోటు చేసుకునే ప్రాంతంలో అక్కడొచ్చే కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని దృష్టిలో పెట్టుకుని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతమివ్వాలి.
2022లో ప్రీలాంచ్లో కొనేవారి గణనీయంగా తగ్గుముఖం పట్టారు. అయినప్పటికీ, కొత్త ఆఫర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే, గతంతో పోల్చితే వీటిపై బయ్యర్లకు అవగాహన అధికమైంది. కాబట్టి, కాస్త జాగ్రత్తగానే ఫ్లాట్లను కొంటున్నారు. హైదరాబాద్లో ఫ్లాట్ల ధరలు అందుబాటులో లేకుండా పోవడం చింతించాల్సిన విషయం. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఈ ఏడాది ప్రాపర్టీ షోల నిర్వహణ కారణంగా కొంతమంది బయ్యర్లు తమకు నచ్చిన ప్రాపర్టీలను ఎంపిక చేసుకునే వీలు కలిగింది. మేం ప్రప్రథమంగా నిర్వహించిన నార్త్ హైదరాబాద్‌లో ప్రాపర్టీ షోలో అనేక మంది సొంతిళ్లను కొనుక్కున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రిడ్ పాలసీ వల్ల పటాన్‌చెరు, సుల్తాన్‌పూర్, సంగారెడ్డి, సదాశివపేట్, కొంపల్లి వంటి ప్రాంతాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. నగరం నలువైపులా రియల్ రింగం విస్తరిస్తుంది కాబట్టి, బిల్డర్లు ఆయా ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరముంది.