ఏదైన ఒక ప్రాంతానికి కాస్త ఆదరణ పెరిగిందంటే చాలు.. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అక్కడ వాలిపోతాయి. రోడ్లు లేకపోయినా, డ్రైనేజీ సదుపాయం రాకున్నా, విద్యుత్తు కనెక్షన్లు వచ్చే సౌలభ్యం లేకున్నా.. ముందుగా వెంచర్లు వేసేందుకు రంగంలోకి దిగుతాయి. హడావిడిగా ఏదో ఒక స్థలాన్ని చూడటం.. ఆయా స్థలయజమానికి అడ్వాన్సు ఇచ్చిన మరుక్షణమే ప్రీలాంచులో అమ్మకానికి పెట్టేయడం ఆనవాయితీగా మారింది. ఇలా, గత మూడేళ్ల నుంచి కొల్లూరులో అనేక మంది రియల్టర్లు, డెవలపర్లు ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలను ఇష్టం వచ్చిన రేటుకు అమ్మేశారు. ఎన్ని నెలలైనా అందులో కొన్ని ప్రాజెక్టుల్లో అనుమతులు రాకపోవడంతో బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేయడం ఆరంభమైంది. అనుమతి ఎప్పుడు వస్తుందంటూ పలు సంస్థలను నిలదీస్తున్నారు. దీంతో, ఏం సమాధానం చెప్పాలో సిబ్బంది తికమక పడుతున్నారు.
కొల్లూరులో కొన్నింటికి అనుమతి ఆలస్యమా?
కొందరు రియల్టర్లు, డెవలపర్లు ఏం చేశారంటే.. స్థలం కనిపించగానే ఐదు నుంచి పది శాతం సొమ్మును స్థలయజమానులకు అడ్వాన్సుగా చెల్లించారు. మిగతా సొమ్మును కట్టేందుకు.. ఆయా ప్లాట్లు లేదా ఫ్లాట్లను ప్రీలాంచ్‌లో విక్రయించి.. స్థలయజమానికి సొమ్ము చెల్లించారు. ఇలాంటి వారిలో కొందరు అనుమతుల కోసం హెచ్ఎండీఏకు ఫీజులు చెల్లించడం ఆలస్యం చేస్తున్నారు. అయితే, కొల్లూరులో ప్రీలాంచ్లో విక్రయించిన ప్రాజెక్టుల్లో.. ధరణీతో పాటు సమస్యల కారణంగా.. కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు రావని నిపుణులు అంటున్నారు. దీంతో, ఇందులో కొన్నవారి పరిస్థితి దారుణంగా తయారవుతుందని తెలిపారు.