వాస్తు.. దీనికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇల్లు కట్టే ముందు దాదాపు ప్రతి ఒక్కరూ వాస్తుకు అనుగుణంగానే ప్లాన్ రూపొందించుకుంటారు. ఇంజనీర్లతోపాటు బిల్డర్లు సైతం వాస్తు అనుకూల నిర్మాణాలకే మొగ్గు చూపిస్తున్నారు. తమ నిర్మాణం వంద శాతం వాస్తుకు అనుగుణమైనదని ప్రకటనల్లోనూ చెప్పుకుంటున్నారు. ఏదైనా కష్టం సంభవిస్తే వాస్తుదోషాలు సరిచేయించుకునేవారు ఎందరో ఉన్నారు. మరి ఇలాంటి వాస్తు పుట్టుపూర్వోత్తరాలేంటి? ఇది ఎక్కడ ఎలా పుట్టి, ఎలా ప్రాచుర్యం పొందింది. ఇందులోని అంశాలేమిటి? మొత్తం వివరాలు రియల్ ఎస్టేట్ గురు పాఠకుల కోసం..
వాస్తు ఎక్కడ.. ఎలా మొదలైంది?
వాస్తు ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టిందనే వాదనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వాస్తు గురించి ఆచారాలు, నమ్మకాలు చాలాకాలంగా ఉన్నాయి. 70 లేదా 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఇళ్లను పరిశీలిస్తే అవి వాస్తుకు అనుగుణంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. వాస్తు శాస్త్రం అనేది మూఢాచారం ఎంత మాత్రం కాదు. ఇది పూర్తిగా శాస్త్రీయమైనది. ఇందులోని ప్రతి అంశమూ సైన్స్ తో ముడిపడింది. భూభ్రమణం, గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత క్షేత్రాలు తదితరాలు ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి. ఫలానా చోట పడకగది ఉండాలి.. ఫలానా చోట వంటగది ఉండాలి.. వంటి వాస్తు సూచనలన్నీ పూర్తిగా సైన్స్ కు సంబంధించిన అంశాలే. పురాణాల ప్రకారం ఉత్తర దిక్కకు తల పెట్టి నిద్రించకూడదు అంటారు. ఇందులోనూ సైన్స్ ఉంది. భూమికి ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. భౌగోళిక స్వరూపం కారణంగా అయస్కాంత తరంగాలు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు ప్రయాణిస్తాయి. ఇది మన మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. అందవల్ల ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటే ఈ తరంగాల కారణంగా మన మానసిక స్థితి క్రమేణా బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది. ఫలితంగా గుండె జబ్బులు, కేన్సర్, ఇతర నరాలకు సంబంధించిన రుగ్మతలు వస్తాయని అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇంటికి ఉత్తరం వైపున బరువు తక్కువగా ఉండాలని వాస్తు సూచిస్తుంది. అందువల్ల ఉత్తరం వైపు ద్వారాలు, కిటికీలు ఎక్కువగా ఉండాలని, తద్వారా ఇంటి గోడ బరువు తగ్గుతుందని వాస్తుశాస్త్రంలో ఉంది. అదే సమయంలో ఉత్తర దిక్కుకు వ్యతిరేకంగా ఉండే దక్షిణ దిశలో ఎక్కువ బరువు ఉండాలి. అలాగే ఈశాన్య మూలలో బరువు ఉండకూడదని అంటారు. దీనికీ ఓ కారణం ఉంది. సూర్యుడి ఆకర్షణ తూర్పు వైపు ఎక్కువగా ఉంటుంది. ఇక భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు నైరుతి నుంచి ఈశాన్యం వైపు తిరుగుతుంది. ఫలితంగా ఈశాన్యం వైపు భారం ఎక్కువగా ఉంటుంది. దీనివల్లే ఈశాన్యం వైపు బరువు ఎక్కువగా ఉండకూడదని అంటారు. ఇలా వాస్తులో ప్రతి అంశానికీ ఓ సైన్స్ సూత్రం ఉంటుంది