-
- నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్
2021 డిసెంబరు దాకా హైదరాబాద్ నిర్మాణ రంగంలో లావాదేవీలు తక్కువగానే నమోదవుతాయి. అప్పటివరకూ కరోనాకు రకరకాల మందులు వచ్చే అవకాశముంది. రెండు డోసులు వ్యాక్సీన్ వేసుకుని.. మాస్క్ నిరంతరం పెట్టుకుంటూ.. ఫంక్షన్లకు వీలైనంత వరకూ దూరంగా ఉంటే.. థర్డ్ వేవ్ ముప్పునూ తప్పించుకోవచ్చు. అప్పటివరకూ నగరంలో స్థిర నివాసం కోసం ఫ్లాట్లను కొనేవారు కొంటారు. కాకపోతే, 2022 తర్వాతే హైదరాబాద్ నిర్మాణ రంగం మళ్లీ పుంజుకునే అవకాశముందని నరెడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత భాగ్యనగరం రియల్ రంగం పయనమెలా ఉంటుందనే అంశంపై ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సారాంశం ప్రేమ్ కుమార్ మాటల్లోనే..
కరోనా సెకండ్ వేవ్ వల్ల నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. గత రెండు నెలల్నుంచి ఇద్దరు, ముగ్గురు కూడా కూకట్‌పల్లిలోని మా ప్రాజెక్టును చూడటానికి రాలేదు. అలాంటిది గత శని, ఆదివారాల్లో ఒక్కసారిగా జాతరలా వచ్చి మా ప్రాజెక్టును సందర్శించారు. వీళ్లు మన వద్ద కొన్నా, కొనకపోయినా ఎక్కడో ఒక చోట అయితే కొనుగోలు చేస్తారు. కరోనా కాస్త తగ్గిందనగానే ప్రజల్లో కొంత ధైర్యం వచ్చింది. చేతిలో ఓ ఇరవై లక్షలుంటే.. మాకు అడ్వాన్సు ఇచ్చి.. మిగతా సొమ్మును రుణం ద్వారా చెల్లిస్తారు. మొన్నటివరకూ కరోనా వస్తుందేమోనని భయంతో ఉండేవారు. బయటికొచ్చి ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ చూసేందుకు బయటికి రాలేదు. ఇప్పుడా సమస్య లేదు కాబట్టే.. లాక్ డౌన్ ఎత్తివేయగానే చూడటానికి విచ్చేశారు.
నెలరోజుల్లోపు నిర్ణయం..
సాధారణంగా, ఎవరైనా కొనుగోలుదారులు ఇల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు.. ముందుగా చుట్టుపక్కల రేట్లను పరిశీలిస్తారు. బిల్డర్ ఎవరో ఆరా తీస్తారు. చెప్పిన సమయానికే ఫ్లాట్లను అందజేస్తారా? వంటి అంశాల్ని పూర్తిగా తెలుసుకున్నాక సుమారు నెల రోజుల్లోపు ఫ్లాటును కొనుగోలు చేస్తారు. సాధారణంగా వంద మంది ప్రాజెక్టును చూస్తే.. అందులో ఐదు శాతం లోపే త్వరగా నిర్ణయం తీసుకుంటారు. పశ్చిమ హైదరాబాద్‌లో తాత్కాలిక సమస్యల వల్ల అమ్మకాలు తగ్గుతాయే తప్ప శాశ్వతంగా అమ్మకాలు పడిపోయే ప్రమాదమే లేదు.
థర్డ్ వేవ్ తర్వాతే..
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇళ్లు కొనేవారు కొంత తగ్గారు. కరోనా వల్ల కొందరు ఉద్యోగులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇక్కడ ఇళ్లను ఖాళీ చేసేశారు. అందుకే, టూలెట్ బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆఫీసులన్నీ మళ్లీ తెరుచుకున్న తర్వాతే మార్కెట్ కళకళలాడుతుంది. నిపుణులు థర్డ్ వేవ్ గురించి చెబుతున్నారు. అయితే, ఆ వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ అప్పటివరకూ మన మార్కెట్ కాస్త నెమ్మదిగానే రియల్ రంగం కొనసాగుతుంది. సాధారణంగా ఇళ్ల మీద పెట్టుబడి పెట్టేవారు యాభై శాతం దాకా ఉంటారు. మిగతావారు స్థిర నివాసానికే కొంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారు. వీళ్లకు థర్డ్ వేవ్‌తో పెద్దగా సంబంధం ఉండదు.
1998 నుంచి..
హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి 1998లో అడుగుపెట్టాను. అప్పటినుంచి దాదాపు ముప్పయ్ నిర్మాణాల్ని పూర్తి చేశాను. అన్నీ ఎకరంలోపు కట్టడాలే కంప్లీట్ చేశాను. ప్రస్తుతం కూకట్‌పల్లిలో ప్రేమ్ సరోవర్ ఎమరాల్డ్ ప్రాజెక్టు కడుతున్నాను. మాతృశ్రీనగర్‌లో ప్రేమ్స్ సాయి సెరీన్ చేపడుతున్నాను. ఇందులో మొత్తం నలభై ఫ్లాట్లు వస్తాయి. 2022లో మరికొన్ని కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాను.