వంట గదిని మాడ్యులార్ కిచెన్ Modular Kitchen తో అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే, కొందరే కాస్త ఖర్చు పెట్టి వంటగదిని ఆధునీకరిస్తారు. దీనికోసం ఎంతలేదన్నా లక్షన్నర నుంచి రెండున్నర లక్షలు దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే చాలామంది ఒకేసారి అంత సొమ్ము పెట్టాలా అని ఆలోచిస్తారు. ఇలాంటి ఇబ్బందుల్ని గుర్తించిన పలు సంస్థలు ఈఎంఐలో మాడ్యులార్ కిచెన్లను అందజేస్తున్నాయి.
వాష్ మెషీంగ్ అనగానే చాలామందికి ఐఎఫ్‌బీ గుర్తుకొస్తుంది. ఈ సంస్థ తాజాగా మాడ్యులార్ కిచెన్ విభాగంలోకి ప్రవేశించి ఈఎంఐలో వంట గదుల్ని అందజేస్తోంది. చిన్న ఫ్లాటు అయినా పెద్ద ఇల్లు అయినా.. ఎవరికి కావాల్సిన సైజులో వారికి ఆధునిక మాడ్యులార్ కిచెన్‌ని డిజైన్ చేస్తోంది.
క్యాపుచినో అనే రకమైన మాడ్యులార్ కిచెన్ కోసం కనీసం 1.65 లక్షలు ఖర్చు అవుతుంది. ఇందుకోసం నెలకు రూ.9167 చొప్పున 18 నెలల పాటు సొమ్ము కడితే సరిపోతుందని చెబుతోంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ మోడల్ కిచెన్ కోసం రూ.2.30 లక్షలవుతుంది. ఇందుకోసం నెలకు రూ.13 వేలు చొప్పున 18 నెలలు చెల్లిస్తే సరిపోతుంది. కాస్త పెద్ద సైజు వంట గదికి మాడ్యులార్ కిచెన్ కావాలన్నా అందజేస్తారు. కాకపోతే, ఇందుకోసం ఎంతలేదన్నా రూ.5 లక్షల దాకా ఖర్చవుతుంది.
ఈ తరహాది మీ ఇంట్లో బిగించాలనుకుంటే, నెలకు రూ.28 వేల దాకా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇంకాస్త విశాలమైన స్థలం ఉన్నవారు.. వంట గది మధ్యలో మాడ్యులార్ కిచెన్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే.. దాదాపు రూ.5.85 లక్షల దాకా ఖర్చొస్తుంది. నెలకు రూ.32,500 దాకా నెలసరి వాయిదా కట్టాలని గుర్తుంచుకోండి.
ఈఎంఐలో మీరు మాడ్యులార్ కిచెన్ బుక్ చేసుకోవాలంటే.. మీరు ఎంచుకున్న వంటగది ధరలో పది శాతం సొమ్ము చెల్లించాలి. తర్వాత అది తయారీకి వెళ్లేటప్పుడు 40 శాతం, మీ ఇంటికి డెలివరీ పంపించడం కంటే ముందే మిగతా 50 శాతం కట్టాలి. బజాజ్ ఫిన్ సర్వ్ వంటివి రుణసౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఆర్‌బీఎల్ బ్యాంకు వంటి బ్యాంకులతో అంగీకారం కుదుర్చుకుని లివ్ స్పేస్ ఈఎంఐ పద్ధితిలో మాడ్యులార్ కిచెన్, వార్డురోబుల్ని అందజేస్తోంది. హోమ్ లేన్ సంస్థ కూడా ఈ సదుపాయాన్ని ఇంటి యజమానులకు అందిస్తోంది.