ఐటీ రంగంలో వార్షికంగా 13 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నాం.. దాదాపు యాభై వేల మందికి ఉద్యోగాలు లభించాయి.. ఫార్మాలో 15 శాతం కంటే అధికంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఉద్యోగాల కొరత ఎప్పటికీ ఉంటుంది. అన్నింటి కంటే ఆశ్చర్యకరంగా ఈసారి వ్యవసాయ రంగం ఆకర్షణీయమైన ఫలితాల్ని రాబట్టింది. దేశంలోనే అధికంగా దాదాపు మూడు కోట్ల టన్నుల వరి తెలంగాణలో పండింది. కరోనాతో సంబంధం లేకుండా ఇంతింత వృద్ధి చెందడం వల్లే హైదరాబాద్ నిర్మాణ రంగానికొచ్చే నష్టమేం లేదని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు విశ్లేషించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ఆదాయం క్రమక్రమంగా పెరిగినప్పుడు.. కొందరు రైతులు తమ పిల్లల పేరిట ఏదో ఒక స్థిరాస్తిని కొనడం ఆనవాయితీగా వస్తుందన్నారు. డిసెంబరులో కరోనా సమస్య సమసిపోయిన తర్వాత.. గిరాకీని పూర్తిగా అంచనా వేశాకే.. డెవలపర్లు వాణిజ్య భవనాల్ని నిర్మించాలని సూచించారు.
కొవిడ్ అనిశ్చితి పూర్తిగా తొలగిపోకపోవడం.. మూడో వేవ్ వస్తుందని.. నాలుగో వేవ్ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే అధిక శాతం మంది బయ్యర్లు వేచి చూసే ధోరణీని అవలంభిస్తున్నారు.. సొంతంగా ఇల్లు కొనుక్కునేందుకు కానీ పెట్టుబడిని పెట్టేందుకు కానీ అధిక శాతం మందికి ధైర్యం రావడం లేదు. కరోనా వల్ల భయపడి చాలామంది పొదుపు చేసిన సొమ్మును బయటికి తీయడం లేదన్నారు. ఇదివరకే ఫ్లాటు కొన్నవారు నెలసరి వాయిదాల్ని చెల్లించడం లేదు. పైగా, కొత్త ఇళ్లను కొనుగోలు చేయడం లేదు. కరోనా కంటే ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే.. మన రియల్ రంగంలో గ్రోత్ ఎక్కువుందని.. కొనుగోలుదారులు తమ వద్ద ఉన్న సొమ్మే కాకుండా అప్పు చేసి మరీ రియల్ రంగంలో పెట్టుబడి పెట్టేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి భూతద్దం వేసి చూసినా కనిపించదు. దీని వల్ల కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించేవారు కాస్త వెనకడుగు వేస్తున్నారు.
2 కోట్ల స్థలానికి గిరాకీ..
కరోనా కంటే ముందు.. హైదరాబాద్ లో ఏటా కోటి చదరపు అడుగుల వాణిజ్య స్థలానికి గిరాకీ ఉండేది. రెండు కోట్ల చదరపు అడుగుల నివాస స్థలానికి గిరాకీ ఉండేది. కరోనా తర్వాత ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యతనిస్తున్నాయి. మరికొన్నేమో ఆఫీసుకు ఉద్యోగుల్ని రప్పించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఇంకొన్ని సగం సగం అంటున్నాయి. అంటే సమావేశాలకు మాత్రమే ఉద్యోగుల్ని ఆఫీసుకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
అందుకే, కరోనా కనుమరుగయ్యాక మన వద్ద ఎంత వాణిజ్య స్థలానికి గిరాకీ ఉంటుంది? ఎంతమంది సొంతిల్లు కొనుగోలు చేస్తారు? అనే అంశంలో పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాణిజ్య స్థలంలో కనీసం యాభై శాతానికైనా గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నాం. మరి, దానికి తగ్గట్టుగానే ఫ్లాట్లు, విల్లాలకు గిరాకీ పెరగాలి. చివరగా నేను చెప్పేదేమిటంటే.. భూముల ధరలు పెరిగాయి. నిర్మాణ సామగ్రి రేట్లు అధికమయ్యాయి. కార్మికుల కొరత తీవ్రంగానే ఉంది. కాబట్టి, రానున్న రోజుల్లో ఫ్లాట్ల రేట్లు పెరుగాతయనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.