Categories: LEGAL

పూర్వాంకరపై రూ.5.5 కోట్ల జరిమానా

పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన ఓ బిల్డర్ కు జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. ఉద్దేశపూర్వకంగా నిబంధనలను తోసిపుచ్చి పర్యావరణానికి నష్టం కలిగించినందుకు రూ.5.5 కోట్లు చెల్లించాలని ఎన్జీటీ దక్షిణ జోన్ ట్రైబ్యునల్ ఆదేశించింది.

చెన్నై చెంగల్ పట్ సమీపంలోని పుదుపక్కంలో 1184 యూనిట్లతో ప్రావిడెంట్ కాస్మో సిటీ పేరుతో పూర్వాంకర ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2008లో ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభించింది. దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా తీసుకుంది. అయితే, తదుపరి ఏడాది ఆ ప్రాజెక్టును విస్తరించాలని, అదనంగా మరో 990 యూనిట్లు నిర్మించాలని పూర్వాంకర సంస్థ నిర్ణయించింది. ఇందుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేసినా, ప్రభుత్వం నిరాకరించింది. అయినప్పటికీ ఆ కంపెనీ అదనపు యూనిట్లను నిర్మించింది.

దీనిపై అపార్ట్ మెంట్ యజమానులు 2021లో ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. నిబంధనలు ఉల్లంఘించి అదనపు నిర్మాణాలు చేయడమే కాకుండా మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, డీజిల్ జనరేటర్ సెట్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఫిర్యాదు చేసింది. వీటిని పరిశీలించడానికి ట్రైబ్యునల్ ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం వాటిని పరిశీలించిన కమిటీ.. అవన్నీ వాస్తవాలేనని నివేదిక ఇచ్చింది. దీంతో పర్యావరణానికి నష్టం కలిగించినందుకు రూ.1.2 కోట్లు జరిమానాగా చెల్లించాలని బిల్డర్ ను ఆదేశించింది. అయితే, పూర్వాంకర కంపెనీ విభేదించింది.

అపార్ట్ మెంట్ నిర్వహణను ఫ్లాట్ యజమానులకు అప్పగించిన మూడేళ్ల తర్వాత కమిటీ పరిశీలన జరిపిందని.. అందువల్ల కాస్మో సిటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషనే ఆ జరిమానా చెల్లించాలని వాదించింది. ఈ అంశంపై ఇరువర్గాల వాదనలు విన్న ట్రిబ్యునల్.. ఈ ప్రాజెక్టులో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించింది. రెండు నెలల్లోగా రూ.5.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా కమిటీ పేర్కొన్న లోపాలను సరి చేయాలని సూచించింది.

This website uses cookies.