ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీని రద్దు చేస్తున్నట్టు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఇది అమలవుతుందని హరియాణా స్థానిక సంస్థల మంత్రి కమల్ గుప్తా పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిపన్నుపై వడ్డీ రద్దు పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ పథకం కింద ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మొత్తం రద్దు అవుతుందన్నారు.
ఆస్తి పన్ను బకాయిల కింద దాదాపు రూ.1000 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని సంబంధిత యజమానులు డిసెంబర్ 31లోగా చెల్లించాలని సూచించారు. గతంలో కేవలం 25 శాతం మంది మాత్రమే ఆస్తి పన్ను చెల్లించేవారని.. ప్రాపర్టీ ఐడీలు తీసుకొచ్చిన తర్వాత అందరూ పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్, సర్వేల ద్వారా 42.7 లక్షల ప్రాపర్టీలను గుర్తించామని, ఇప్పటివరకు 33 లక్షల ప్రాపర్టీలకు ఐడీలు ఇచ్చామని తెలిపారు.