Categories: LATEST UPDATES

రూ.150 కోట్లతో అపర్ణా విస్తరణ

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ సామగ్రి తయారీదారు సంస్థ అపర్ణా ఎంటర్ ప్రైజెస్ తన వ్యాపారాన్ని విస్తరించడానికి, పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడానికి రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని రుద్రారంలో అత్యాధునిక యూపీవీసీ ప్లాంటు నెలకొల్పడానికి రూ.100 కోట్లు కేటాయించనుంది. ఈ ప్లాంటు ఏర్పాటైతే.. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న యూపీవీసీ ఉత్పత్తులు 70 శాతం మేర పెరిగి 700 టన్నుల నుంచి 1200 టన్నులకు చేరుకుంటాయి. అలాగే విండోలు 20వేల చదరపు మీటర్ల నుంచి 50వేల చదరపు మీటర్లకు పెరుగుతాయి. మరో రూ.50 కోట్లను అపర్ణా ఎంటర్ ప్రైజెస్ టైల్స్, రెడీ మిక్స్ కాంక్రీట్, అల్యూమినియం వ్యాపారాలను విస్తరించేందుకు వినియోగించనుంది.

పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ కు పెరుగుతన్న డిమాండ్ వంటి అంశాలు నిర్మాణ సామగ్రి పరిశ్రమకు బలమైన ఊతమిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ పరిశ్రమ 8 నుంచి 12 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో అపర్ణా ఎంటర్ ప్రైజెస్ తన వ్యాపారాన్ని విస్తరించి, మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ‘దేశవ్యాప్తంగా మా వ్యాపారం విస్తరించి ఉన్నందున ప్రతి వ్యక్తి, సంస్థ విభిన్న మౌలిక సదుపాయాల అవసరాలకు సమగ్ర పరిష్కారాలు అందించాలని నిర్ణయించుకున్నాం.

అపర్ణా ఎంటర్ ప్రైజెస్ అత్యుత్తమ ఉత్పత్తులను అందించడానికి నిరంతరం కట్టుబడి ఉంది. కొత్త యూపీవీసీ ఫెసిలిటీలో మా పెట్టుబడి, అలాగే టైల్స్, రెడీ మిక్స్ కాంక్రీట్, అల్యూమినియం వ్యాపారాల విస్తరణ మార్కెట్లో మా స్థానాన్ని మరింత పెంచడంతోపాటు కస్టమర్ల అవసరాలను తీరుస్తుందని బలంగా విశ్వసిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి రూ.2100 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని అపర్ణా ఎంటర్ ప్రైజెస్ ఎండీ అశ్విన్ రెడ్డి తెలిపారు. వెస్ట్ మార్కెట్లోకి విస్తరించాలనే లక్ష్యంతో ఇప్పటికే ముంబైలో ఈ సంస్థ తన ఆర్ఎంసీ వ్యాపారాన్ని ప్రారంభించింది.

This website uses cookies.