Categories: LATEST UPDATES

రియల్ వివాద పరిష్కారానికి మధ్యవర్తి నియామకం..

ఫ్లాట్ బిల్డర్, కొనుగోలుదారుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి న్యాయస్థానం ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జిని మధ్యవర్తిగా నియమించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎన్. కిరుబాకరన్ ను ఓ క్రిమినల్ పిటిషన్ పై మధ్యవర్తిగా నియమిస్తూ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

2017లో రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్ల నిర్మాణానికి రూ.13.64 కోట్లు తీసుకుని, ఇప్పటివరకు వాటిని నిర్మించి ఇవ్వలేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే, సివిల్ వివాదమేనని, కానీ క్రిమినల్ కేసు నమోదు చేశారని బిల్డర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందువల్ల ఆ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరారు. అయితే, ఇందులో ఫిర్యాదుదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నప్పటికీ, వారికి ఫ్లాట్లు అప్పగించలేదని, అందువల్ల ఈ కేసులో దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు బిల్డర్ కు ఓ అవకాశం ఇవ్వాలని ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. నెల రోజుల్లోగా ఈ కేసును మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొంది. ఇందుకోసం రిటైర్డ్ న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించింది. నెల రోజుల్లో పరిష్కారం కాని పక్షంలో పోలీసులు నిబంధనల ప్రకారం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

This website uses cookies.