Categories: LATEST UPDATES

ముంబైలో పెరిగిన అమ్మకాలు?

దేశంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం నెమ్మదిగా కోలుకుని పూర్వ వైభవం సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా, అమ్మకాలకు సంబంధించిన గణాంకాలు బాగుండటమే ఇందుకు నిదర్శనం. డెవలపర్లు మళ్లీ మార్కెట్లోకి వస్తున్నారనే సంకేతాలు ఇచ్చేలా పరిస్థితులు ఉండటం విశేషం.

కొత్త ఇళ్ల సరఫరా ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోగా.. డిమాండ్ సైతం ఊపందుకోవడంతో రియల్ రంగం నెమ్మదిగా పరుగులు తీస్తోంది. ఈ పరిణామాలన్నీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని తెలియజేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. గత త్రైమాసికంలో ధరల సగటు పెరుగుదల 0.4 శాతంగా నమోదైనట్టు వెల్లడైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 0.3 శాతంగా ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా కనిపిస్తున్న ధరల పెరుగుదల అలాగే కొనసాగుతోంది. 2022 జూన్ లో అత్యధికంగా 2.8 శాతం మేర ధరలు పెరిగాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో పరిస్థితిని పరిశీలిస్తే.. గత ఆరు నెలల్లో ప్రాపర్టీ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు వెల్లడైంది. 2017తో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఎక్కువ వృద్ధి నమోదైంది.

దేశవ్యాప్తంగా 2022 జూన్ చివరి నాటికి విక్రయించిన యూనిట్ల సంఖ్య.. కరోనా కంటే ముందు (2020 ఫిబ్రవరి)తో పోలిస్తే కేవలం 8 నుంచి 9 శాతం మాత్రమే తక్కువగా ఉండటం గమనార్హం. ఇక ముంబైలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో అమ్మకాలు ఏకంగా 22 శాతం మేర పెరిగాయి. అయితే, ఇతర నగరాల్లో మాత్రం ఈ స్థాయిలో అమ్మకాలు లేవు. ప్రస్తుతం పరిస్థితులు అన్నీ కుదుటపడుతున్నందున త్వరలోనే ఆయా నగరాల్లో కూడా రియల్ రంగం ఊపందుకుంటుందని చెబుతున్నారు.

This website uses cookies.