-
నిబంధనల ప్రకారం కట్టేవారిని
ఇబ్బందులకు గురి చేస్తే ఎలా?
హైదరాబాద్లో దాదాపు నలభై నుంచి యాభై మంది రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు.. గత రెండు మూడేళ్ల నుంచి ప్రీలాంచ్ దందాలు చేస్తున్నారు. రేటు తక్కువ అంటూ.. ప్లాట్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఐటీ స్పేస్, మెట్రో స్టాళ్లు, అద్దె గృహాలు.. ఇలా రకరకాల విభాగాల్లో.. అమాయక కొనుగోలుదారులకు ఆశ చూపెట్టి కోట్ల రూపాయల్ని దండుకుంటున్నారు. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వీరిని వదిలేసి.. నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని కట్టేవారిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సబబు?
నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని కట్టే బిల్డర్లను ప్రభుత్వ అధికారులు రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. ఎన్వోసీల కోసం సతాయిస్తారు. సకాలంలో అనుమతిని మంజూరు చేయకుండా ఒక ఆటాడుకుంటారు. ప్రతి పనికో రేటు కార్డును పెట్టుకుని.. అవి చెల్లిస్తేనే అనుమతినిస్తారు. లేకపోతే ఆయా బిల్డర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ, మున్సిపల్, వాటర్ బోర్డు, విద్యుత్తు, పీసీబీ.. ఇలా ఎక్కడికెళ్లినా ఇదే పరిస్థితి. కానీ, ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు అమ్మే వారికి వీరితో ఎలాంటి ఇబ్బందులుండవు.
ఎందుకంటే, అసలు వీరు నిర్మాణాల్ని ఆరంభిస్తే కదా! చేతిలో కోట్లు వచ్చి పడ్డాక.. అపార్టుమెంట్లను నిర్మించడానికి ఖర్చెందుకు చేయాలని భావించే దగుల్బాజీ ప్రమోటర్లు మార్కెట్లో ఉండటం దారుణమైన విషయం. అలాంటి వారిని వదిలేసి.. మార్కెట్లో రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ.. సకాలంలో నిర్మాణ సామగ్రి దొరక్క.. నైపుణ్యమున్న పనివాళ్లు లభించక.. మరోవైపు ఫ్లాట్లు అమ్ముడుకాక.. సకాలంలో వడ్డీలు చెల్లించలేక.. బీపీలు, షుగర్‌లు పెంచుకుని.. ఆరోగ్య సమస్యలు ఎదురైనా.. ధైర్యంగా తట్టుకుని నిలబడి.. సకాలంలో ఫ్లాట్లు ఇచ్చేందుకు అహర్నిశలు శ్రమించే డెవలపర్లను ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇప్పటికైనా ప్రీలాంచ్ మోసగాళ్లను నియంత్రించకపోతే హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా లభిస్తున్న గుర్తింపు మసకబారిపోయే ప్రమాదం లేకపోలేదు. భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతినే అవకాశముంది. కాబట్టి, ప్రీలాంచ్ ప్రమోటర్లను ప్రభుత్వం దారిలోకి తేవాల్సిన అవసరముంది.
హైదరాబాద్లో భువనతేజ, ఆర్ జే గ్రూప్, జయ గ్రూప్, పారిజాత డెవలపర్స్, ఏవీ ఇన్ ఫ్రా కాన్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, యోషితా ఇన్ఫ్రా, ఐరా రియాల్టీ, ఈఐపీఎల్, హాల్ మార్క్ కన్ స్ట్రక్షన్స్, అర్బన్ రైజ్, సుమధుర.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది డెవలపర్లు ప్రీలాంచ్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరిలో ఎంతమంది సకాలంలో ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించగలిగే సత్తా ఉంది? ఎంతమందికి విక్రయించారు? బయ్యర్ల నుంచి వసూలు చేసిన సొమ్మెంత? నిర్మాణాల తాజా పరిస్థితి ఏమిటి? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులేమిటి? వంటి వివరాల్ని తెలంగాణ రెరా అథారిటీ తక్షణమే సేకరించాలి. లేకపోతే, రేపొద్దున ఈ సంస్థల్లో ఏ ఒక్కటి బోర్డు తిప్పేసినా.. అందుకు సంబంధించిన సమాచారం రెరా వద్ద ఉంటుంది. బయ్యర్లకు న్యాయం చేయడానికి వీలు కలుగుతుంది.