Categories: LATEST UPDATES

నకిలీ వెబ్ సైట్లతో జాగ్రత్త

  • రియల్ ఎస్టేట్ లోనూ వెల్లువలా ఫేక్ వెబ్ సైట్లు

ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ వినియోగం పెరిగింది. ఈ కోవలోనే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల ఉపయోగం పెరుగుతోంది. డిజిటల్ వినియోగం సౌకర్యంగా ఉంటున్నప్పటికీ, మోసాలకు కూడా అంతే అనువుగా ఉంటోంది. ప్రస్తుతం రియల్ రంగానికి సంబంధించి ఏకంగా 400 శాతానికి పైగా నకిలీ వెబ్ సైట్లు ఉన్నట్టు ఓ ప్రముఖ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఎంఫిల్టరెల్ట్ అనే అంతర్జాతీయ సంస్థ ఈ అంశంపై అధ్యయనం నిర్వహించి నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం 387 నకిలీ వెబ్ సైట్లు ఉన్నాయని.. వాటిలో కొన్ని బ్రాండ్ పేర్లను వినియోగించుకుని అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అటు బిల్డర్లు, ఇటు కొనుగోలుదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాజెక్టుల పేరుతో సైతం వెబ్ సైట్లు ఏర్పాటు చేస్తుండటం ఆందోళనకర అంశమని, ఈ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.

కొనుగోలుదారులు మోసపోకుండా ఆయా పేరున్న సంస్థలు చర్యలు చేపట్టాలని సూచించింది. రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులు అయితే, వాటికి సంబంధించిన అన్ని వివరాలూ సైట్ లో పొందుపరుస్తారని.. కానీ నకిలీ వెబ్ సైట్లలో ఇవేవీ ఉండవని.. అందువల్ల కొనుగోలుదారులు వాటిని క్షుణ్నంగా పరిశీలించుకోవాలని పేర్కొంది. ప్లాట్ బుక్ చేసుకోవడం కోసం కొంత మొత్తం చెల్లించాలని సైబర్ నేరగాళ్లు కోరతారని.. ఆ విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని నివేదికలో పేర్కొన్నారు. అలాగే మీ వ్యక్తిగత సమాచారం ఏదీ కూడా సైట్ లో షేర్ చేసుకోవద్దని స్పష్టం చేసింది.

This website uses cookies.