సాహితీ ఎండీ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయడంతో హైదరాబాద్‌లోని వివిధ సంస్థల ప్రీలాంచ్ కొనుగోలుదారుల్లో ఎక్కడ్లేని ఉత్సాహం ఏర్పడింది. సాహితీ వంటివి ఇంకా పలు సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. పెట్టుబడిదారుల నుంచి సొమ్ము సమీకరించి.. ప్లాట్లు, ఫ్లాట్లను అందించక.. మోసం చేస్తున్న నకిలీ రియల్టర్ల సంఖ్య తక్కువేం కాదు. ఇలాంటి వారి చేతిలో తమ కష్టార్జితాన్ని పోసి తిప్పలు పడుతున్న బయ్యర్లు ఎక్కువే ఉన్నారు. ముఖ్యంగా భువనతేజ, ఫార్చ్యూన్ 99 హోమ్స్, జయ గ్రూప్ వంటి పలు సంస్థల్లో సొమ్ము పెట్టి అనేకమంది బాధపడుతున్నారు. ఆర్మీలో పని చేసే ఒక జవాన్ భువనతేజ సంస్థలో పెట్టుబడి పెడితే.. సొమ్ము వెనక్కి ఇవ్వమని అడిగితే ఎండీగా వ్యవహరించే చక్కా సుబ్రమణ్యం దుర్భాషలాడాడని సమాచారం. డెబ్బయ్ ఏళ్ల వృద్ధుడు భువనతేజలో సొమ్ము పెట్టి నానా ఇబ్బందులు పడుతున్నాడని తెలిసింది. ఇక, సింగరేణీ కార్మికుల్లో కొంతమంది శామీర్‌పేట్‌లోని హ్యాపీ హోమ్స్‌లో పెట్టుబడి దారుణంగా మోసపోయారు. అంత దూరం నుంచి నగరానికి రాలేరు కాబట్టి, ఫోన్ చేసినా సంస్థ ఎండీ స్పందించట్లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. తమకు సొమ్ము ఇవ్వకుండా.. భువనతేజ సంస్థ ఎండీ విదేశాలకు పారిపోతాడేమోననే భయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, వీలైనంత త్వరగా ఈ సంస్థ ఎండీని విచారించి.. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
This website uses cookies.