కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591 : ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే గల సర్వీస్ రోడ్డులో ఆకాశహర్మ్యాల్ని నిర్మించాల్సిందే. కాకపోతే మియాపూర్, బాచుపల్లి, బౌరంపేట్, కిస్మత్ పూర్ వంటి ఏరియాల్లో ఆకాశహర్మ్యాల్ని నిర్మించడమేమిటి? ఆయా ప్రాంతాల్లో ఉన్న రోడ్ల వెడల్పు ఎంత? అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థ సామర్థ్యం ఎంత? మంచినీటి సరఫరా సామర్థ్యమెంత?.. ఇలాంటి అంశాల్ని బేరీజు వేయకుండా.. గత ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేసింది? మరి, కొందరు బిల్డర్లు ఎందుకిలా ఇష్టం వచ్చినట్లు, స్థలం దొరికితే చాలు స్కై స్క్రేపర్లను కట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నారు? 2018 కంటే ముందు హైదరాబాద్ నిర్మాణ రంగంలో దర్శనమివ్వనీ పరిస్థితి.. 2019లోనే ఎందుకు మొదలైందో తెలుసా? జీవో నెం 50ను ప్రవేశపెట్టడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. జీవో నెం. 86 గురించి తెలుసు.. 168 జీవో గురించి విన్నాం.. ఈ జీవో నెం. 50 ఏమిటన్నది మీ సందేహమా? అసలీ జీవో వల్ల నిర్మాణ రంగం ఎందుకు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చిందో తెలుసా?
ప్రపంచ చరిత్రను క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకంగా విభజించినట్లే.. హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని జీవో నెం. 86 కంటే ముందు.. ఆ తర్వాత గా విభజించాల్సిందే. ఎందుకంటే, 2006లో ఈ జీవో రాకముందు వరకూ.. నిర్మాణ రంగం అస్తవ్యస్తంగా ఉండేది. అనుమతి ప్రకారం కట్టే బిల్డర్లను వేళ్ల మీద లెక్క పెట్టాల్సి వచ్చేది. అదనపు అంతస్తులు వేయకుండా నిర్మించేవాళ్లు బిల్డర్లు కానే కాదని కూడా భావించేవారు. అలాంటిది, దివంగత నేత వైఎస్సార్ హైదరాబాద్ నిర్మాణ రంగానికో దిశానిర్దేశం చేశారు. జీవో నెం 86 ద్వారా భవనాల్ని క్రమపద్ధతిలో కట్టే విధానానికి అంకురార్పణ జరిగింది అప్పుడే. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవడం అలవాటైంది అప్పట్నుంచే.
అందుకే, జీవో నెం 86 భవన నిర్మాణ సంస్థలకో వరం వంటిదని చెప్పొచ్చు. ఎందుకంటే అపార్టుమెంట్ల అనుమతికి సంబంధించిన నిబంధనల్లో ఉన్న అసంబద్ధతను తొలగించి.. ప్రతి బిల్డర్ అనుమతి ప్రకారం నిర్మాణం చేసేందుకు తోడ్పడిందీ ఈ జీవో. అప్పటివరకూ అధిక శాతం బిల్డర్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను కూడా తీసుకునేవారు కాదు. అలాంటిది, ప్రతిఒక్కరూ విధిగా ఓసీని తీసుకునేలా చేసిందీ జీవో. అప్పటివరకూ హైదరాబాద్‌లో నాన్ మల్టీస్టోరీడ్ బిల్డింగులను కట్టే బిల్డర్లంతా ఆ తర్వాత హైరైజ్ కట్టడాల్ని నిర్మించే స్థాయికి చేరారంటే.. ఈ జీవో నెం. 86 ప్రధాన కారణమని చెప్పొచ్చు.
జీవో నెం 86లోని టేబుల్ 4లో.. 50 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు గల భవనానికి 30 మీటర్ల రోడ్డు ఉండి.. ఒక ఎకరం భూమి ఉంటే.. 16 మీటర్ల సెట్ బ్యాక్‌తో ఎన్ని అంతస్తులైనా కట్టుకునే వీలు కలిగింది. కానీ, 2006 నుంచి 2012 వరకూ.. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోనూ ఫ్లాట్ల ధరలు తక్కువ ఉండటంతో.. హైరైజ్ భవనాల్ని కట్టడానికి డెవలపర్లు పెద్దగా ముందుకొచ్చేవారు కాదు. కానీ, బిల్డర్లు 17 అంతస్తుల కంటే ఎక్కువ భవనాల్ని నిర్మించడానికి బిల్డర్లు ముందుకొస్తున్నారని భావించిన అధికారులు.. టేబుల్ 4లో ఒక నిబంధనను పొందుపరిచి బిల్టప్ ఏరియాను పూర్తిగా నియంత్రించారు. అంటే, హైరైజ్ భవనాల్లో బిల్టప్ ఏరియాను నియంత్రణలో ఉండేలా ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఎందుకంటే, ఈ టేబుల్ 4 కింద ఉన్న.. 55 మీటర్ల బిల్డింగ్ హైట్ తర్వాత..
ప్రతి ఐదు మీటర్ల ఎత్తుకు వెళ్లేకొద్దీ.. 0.5 మీటర్ల మేరకు అదనపు సెట్ బ్యాక్‌ను తప్పనిసరిగా వదిలిపెట్టాలనే నిబంధనను విధించారు. ఇదే నిబంధనతో నాన్ మల్టీస్టోరీడ్, మీడియం రైజ్, హైరైజ్, స్కై స్క్రేపర్లలో బిల్డప్ ఏరియా ఎలా ఉండాలనే విషయాన్ని 168 జీవోలో పక్కాగా నిర్వచించారు. ఒక ఐదు ఎకరాల భూమిలో నాన్ మల్టీ స్టోరీడ్‌లో ఎకరాలో.. దాదాపు లక్ష చదరపు అడుగుల బిల్టప్ ఏరియా వస్తే.. 8 అంతస్తుల భవనం కడితే 1.30 లక్షల చదరపు అడుగులు, 15 అంతస్తులు కడితే 1.75 లక్షల చదరపు అడుగులు, 22 అంతస్తులు కడితే 2 లక్షల చదరపు అడుగులు వచ్చేలా 168 జీవోలో పొందుపరిచారు. అంటే, స్థల ఆకారాన్ని బట్టి, దాన్ని ముందున్న రోడ్డు వెడల్పును బట్టి భవనం ఎత్తు ఆధారపడి ఉండేది. మరి, ఇలాంటి నియంత్రణ అవసరమా అంటే.. ఔననే చెప్పాలి. ఎందుకంటే, టౌన్ ప్లానింగ్ నిబంధనలను పక్కగా గమనిస్తే.. జనసాంద్రతను బట్టి ఒక ఎకరం లేదా హెక్టార్ స్థలంలో ఎంతమంది నివసించాలనేది పక్కా నిర్వచించి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
2018 దాకా హైదరాబాద్‌లో నిర్మాణ రంగం ఒక పద్ధతి ప్రకారమే ముందుకు వెళ్లేది. నిర్మాణ సంస్థలు జీవో నెం. 168 ప్రకారం హైరైజ్ భవనాల్ని కట్టేవారు. కానీ, మంత్రి కేటీఆర్‌కు ఎందుకోగానీ.. నగరంలో ఆకాశహర్మ్యాలుండాలనే ఆలోచన వచ్చింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనూ మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాల్ని నిర్మించాలని చెప్పారు. మరి, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకునో.. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తేవాలనే ఆలోచనేమో తెలియదు కానీ.. 2019లో ఒక్కసారిగా జీవో నెం. 50ని మంత్రి కేటీఆర్ హఠాత్తుగా తెరమీదికి తెచ్చారు. ఎలాంటి మార్పుల్లేకుండా జీవోను తెచ్చి ఉంటే బాగుందేది. కానీ, ఆయన తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం కారణంగా.. హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు రావడమేమిటో కానీ.. ఒక్కసారిగా భూముల ధరలు పెరిగిపోయాయి. సామాన్యులకు ఫ్లాట్లు అందకుండా పోయాయి. నిర్మాణ రంగం బిల్డర్ల చేతిలో నుంచి భూస్వాముల కబంధహస్తాల్లో చిక్కుకుంది. ఔను.. మీరు చదివింది నిజమే.. భూయజమానుల కబంధహస్తాల్లో చిక్కుకుని నిర్మాణ రంగం విలవిలాడుతోంది. ఎలాగో తెలుసా?
2018 వరకూ జనసాంద్రతను బట్టి.. ఒక ఎకరం స్థలంలో ఎంతమంది నివసించాలనే విషయాన్ని టౌన్ ప్లానింగ్ నిబంధనలు పక్కగా చెబుతున్నాయి. కానీ, జీవో నెం.50లోని టేబుల్ 4లోని అమెండ్‌మెంట్ 6ని సవరించారు. 50 నుంచి 55 మీటర్ల ఎత్తులో కట్టే నిర్మాణాలకు 16 మీటర్ల సెట్ బ్యాక్, 55 నుంచి 70 మీటర్ల ఎత్తులోని నిర్మాణాలకు 17 మీటర్ల సెట్‌బ్యాక్, 70 నుంచి 120 మీటర్లకు 18 మీటర్ల సెట్ బ్యాక్, 120 మీటర్ల ఎత్తు గల భవనాలకు 20 మీటర్ల సెట్‌బ్యాక్ మాత్రమే ఉండేలా చేశారు. అంటే, 55 మీటర్ల బిల్డింగ్ హైట్ తర్వాత.. ప్రతి ఐదు మీటర్ల ఎత్తుకు వెళ్లేకొద్దీ.. 0.5 మీటర్ల మేరకు అదనపు సెట్ బ్యాక్‌ను తప్పనిసరిగా వదిలిపెట్టాలనే నిబంధనను తొలగించారు. దీని వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగానికి జరిగిన నష్టమేమిటంటే.. ఒక ఎకరా స్థలంలో అపార్టుమెంట్లను కట్టేవారికి 4 నుంచి 5 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా రావడం ఆరంభమైంది
. కమర్షియల్ బిల్డింగ్ అయితే 9 లక్షల చదరపు అడుగుల వరకూ బిల్టప్ ఏరియా నిర్మించే వీలు దొరికింది. అంటే, అంతకంటే ముందు వరకూ ఎకరం స్థలంలో రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు మహా అయితే రెండు లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా వస్తే.. జీవో నెం. 50 వచ్చాక 4 నుంచి 5 లక్షల బిల్టప్ ఏరియా రావడం మొదలైంది. ఫలితంగా, నగరంలో భూములున్నవారంతా ఒక్కసారిగా చక్రం తిప్పడం మొదలు పెట్టారు. ఎవరెంత ఎక్కువ బిల్టప్ ఏరియా కడితే వారికే డెవలప్‌మెంట్ కింద భూముల్ని ఇస్తామనే నిబంధనను విధించడం ఆరంభించారు. ఫలితంగా, బిల్డర్ల మధ్య పోటీ పెరిగి.. ఒక్కొక్కరు అధిక విస్తీర్ణంలో ఆకాశహర్మ్యాల్ని కట్టడాన్ని ఆరంభించారు.
పేరెన్నిక గల బిల్డర్లు ఆకాశహర్మ్యాల్ని కట్టారంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే, కాస్త వెనకా ముందు అయినా.. అపార్టుమెంట్లను పూర్తి చేస్తారు కాబట్టి. ఎందుకంటే, పేరున్న బిల్డర్లు తమ బ్రాండ్‌కు మచ్చ తెచ్చుకోవాలని కోరుకోరు. సరిగ్గా, ఇదే సమయంలో ఇతర రంగాలకు చెందినవారిలో కొందరు బిల్డర్లుగా అవతారమెత్తారు. ఒక్క అపార్టుమెంట్ కూడా కట్టనివారు బిల్డర్లుగా మార్కెట్లోకి అడుగుపెట్టారు. కొల్లూరు, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో స్కై స్క్రేపర్లను ప్రారంభించి.. ప్రీలాంచుల్లో నామమాత్రపు రేటుకే ఫ్లాట్లను విక్రయించడం మొదలెట్టారు.
ఈ సొమ్మును మొత్తం బయ్యర్ల నుంచి ముందే తీసుకుని స్థలయజమానికి కట్టాలన్నది వీరి తాపత్రయం. మార్కెట్ మెరుగ్గా ఉన్నంతకాలం.. పెట్టుబడిదారులు వస్తారు. కానీ, పరిస్థితి మారిపోతే, అసలుకే ఎసరొస్తుందని ఈ సో కాల్డ్ కొత్త బిల్డర్లు అర్థం చేసుకోలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితిలో సమూల మార్పులొచ్చాయి. ప్రభుత్వం స్థిరపడటానికి కనీసం మూడు నుంచి ఆరు నెలలైనా పడుతుందనే విషయం తెలిసిందే. దీంతో, నిర్మాణ రంగంలో ప్రైస్ కరెక్షన్ ఏర్పడి.. ధరలు స్థిరపడే అవకాశముంది. కాబట్టి, ఈ ప్రీలాంచ్ కేటుగాళ్లలో ఎక్కవ శాతం మార్కెట్ నుంచి నిష్క్రమించే అవకాశం లేకపోలేదు.
జీవో నెం. 50ని పూర్తిగా రద్దు చేయాలని కొందరు బిల్డర్లు కోరుతుండగా.. మరికొందరేమో ఆకాశహర్మ్యాలు అవసరం అనుకునే చోట.. ముందుగా మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసి ఇస్తే మేలని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే, మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్‌లో రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు సరిపోక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా, టౌన్ ప్లానింగ్ ముఖ్య ఉద్దేశ్యాన్ని తుంగలో తొక్కినట్లు అవుతుంది.
(ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సూచనలను regpaper21@gmail.comకి పంపించగలరు.)
This website uses cookies.