Categories: LATEST UPDATESRera

రెరాతో రియల్ రంగంలో పారదర్శకత

రియల్ ఎస్టేట్ రంగంలో రెరా పూర్తి పారదర్శకత తీసుకొచ్చిందని బీహార్ అభివృద్ధి కమిషనర్ వివేక్ కుమార్ ప్రశంసించారు. బీహార్ లో రెరా అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా క్రెడాయ్ బీహార్ చాప్టర్, పాట్నా చాప్టర్ ఆఫ్ బిల్డర్స్ అసోసియేషన్, రెరా-బీహార్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్ షాప్ లో ఆయన ప్రసంగించారు. రెరా ఏర్పాటు వల్ల రియల్ రంగంలో లైసెన్స్ రాజ్ వస్తుందనే ఆందోళనలను బీహార్ రెరా పటాపంచలు చేసిందని పేర్కొన్నారు. రెరా-బీహార్ చైర్మన్ నవీన్ వర్మ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వ శాఖలు, రెరా, ఇతర స్టేక్ హోల్డర్ల మధ్య మరింత సమన్వయం పెంపొందించడానికి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆ కమిటీ రియల్ రంగంలో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి తగిన పరిష్కారం చూపాలన్నారు. దీనికి వివేక్ కుమార్ స్పందిస్తూ.. వెంటనే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. స్టేక్ హోల్డర్ల సమస్య పరిష్కారంలో బీహార్ రెరా చాలా చక్కగా పనిచేస్తోందని.. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపే పూర్తిచేస్తోందని ప్రశంసించారు. కాగా, రెరా వల్ల బీహార్ రియల్ రంగంలో పారదర్శకత ఏర్పడిందని, మరి తెలంగాణలో ఎప్పుడు ఏర్పడుతోందో అని సంబంధిత నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

This website uses cookies.