Categories: LATEST UPDATES

నిర్మాణ సామగ్రి అమ్మకాలు పెరుగుతాయా?

    • గతేడాది కంటే 15-20 శాతం మేర పెరుగుదల

నిర్మాణ రంగానికి సంబంధించిన సామగ్రి అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులపై ఎక్కువ నిధులు వెచ్చించనున్న నేపథ్యంలో నిర్మాణ సామగ్రి అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఇవి 15 శాతం నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 60.5 శాతానికి పెరిగినప్పటికీ, స్థానిక అమ్మకాలు 11.4 శాతం మేర తగ్గాయి.

‘గత సంవత్సరం రోడ్డు నిర్మాణం, ఇతర నిర్మాణ కార్యకలాపాలు తక్కువగా ఉన్న కారణంగా నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో 8 శాతం తగ్గుదల నమోదైంది. అయితే, ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు వసతుల కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో నిర్మాణ సామగ్రి అమ్మకాలు గణనీయంగా పెరగనున్నాయి’ అని జేసీబీ ఇండియా ఎండీ దీపక్ శెట్టి తెలిపారు. అయితే, నిర్వహణ వ్యయాలు బాగా పెరిగిన నేపథ్యంలో సరఫరా చైన్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో అనే ఆందోళన నెలకొన్నట్టు వివరించారు.

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేపిటల్ వ్యయం రూ.7.5 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. జాతీయ మౌలిక వసతుల పైప్ లైన్ కింద 2020-2025 మధ్యలో మొత్తం రూ.108 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించడం, స్మార్ట్ సిటీల నిర్మాణం, కొత్త మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు నవీ ముంబై, జెవార్ లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటివి నిర్మాణ పరిశ్రమకు ఊతమిచ్చే నిర్ణయాలని పేర్కొన్నారు.

అలాగే మౌలిక వసతుల అభివృద్ధిలో పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ దశాబ్దం చివరినాటికి నిర్మాణ సామాగ్రి విషయంలో భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ గా అవతరించనుందని శెట్టి స్పష్టంచేశారు. ప్రస్తుతం అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది.

This website uses cookies.