Categories: Celebrity Homes

బిపాసా, కరణ్ గ్రోవర్ ఇల్లు చూసొద్దాం..

బిపాసా బసు.. తన నటనతో ఎంతోమంది కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ త్వరలోనే తల్లి కాబోతున్నారు. కరణ్ సింగ్ గ్రోవర్ ను మనువాడిన ఈ నటి ఇంటి విశేషాలు చూసొద్దామా?

ముంబై బాంద్రాలో రణగొణ ధ్వనులకు దూరంగా చక్కని ప్రదేశంలో ఈ జంట ఇల్లు ఉంది. బిపాసా, కరణ్ ల ఇంటికి ప్రధాన ఆకర్షణ టెర్రస్ గార్డెన్. ఎన్నో కార్యకలాపాలకు ఇది వేదిక. యోగా స్టూడియోగా, వర్కౌట్ స్టేషన్ గా, రీడింగ్ స్పాట్ గా, సాయంత్రం కాఫీ తాగుతూ ఉల్లాసంగా కబుర్లు చెప్పుకునే ప్రదేశంగా ఎన్నింటికో ఇది బాగా అక్కరకొస్తుంది. ఈ జంటకు అత్యంత ఇష్టమైన హ్యాంగవుట్ స్పాట్ ఇదే. ముఖ్యంగా కరణ్ ఈ ప్రదేశాన్ని బాగా వినియోగించుకుంటారు. లాక్ డౌన్ సమయంలో వీరిరువురూ ఇక్కడే ఎక్కువ సమయం గడిపారు. కరణ్ తన సాధారణ జిమ్మింగ్ పరికరాలతో విసుగు చెందినప్పుడు మట్టి సంచులనే డంబెల్స్ లా మార్చి ఇక్కడే వ్యాయామం చేస్తారు.

బిపాసా ఇంట్లో భారీ కుండీల్లో పెట్టిన మొక్కలు, ఆకట్టుకునే చెక్క ఫర్నిషింగ్స్, బెస్పోక్ వికర్ స్వింగ్ చైర్, పుష్కలంగా వచ్చే సహజసిద్ధమైన కాంతి మంత్రుముగ్ధుల్ని చేస్తాయి. బెడ్ రూంలో చెక్క ఫ్లోరింగ్, భారీ సైజు బెడ్, మినిమల్, ఫంక్షనల్ సైడ్ ల్యాంప్, సోఫా కనువిందు చేస్తాయి. ఇక రూఫ్ టాప్ పక్కనే ఉన్న గ్రీన్ హౌస్ శైలి గది అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు కిటికీలు, పిరమిడ్ శైలి చెక్క సీలింగ్ ఉండటంతో చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. స్నేహితులు, బంధువులతో ఆదివారం బ్రంచ్ లకు సరైన ప్రదేశం అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే, ప్రస్తుతం దీనిని గ్రోవర్ తన తాత్కాలిక ఆర్ట్ స్టూడియోగా మార్చుకున్నారు. ఇందులో ఎన్నో కాన్వాస్ లు ఉన్నాయి. ఈ అద్దాల గదిలో పెద్ద షాండ్లియర్ కూడా ఉంది. ఇంకా రంగురంగుల కుషన్ తో కూడిన పింక్ స్వెడ్ సోఫా ఆ గదికి మరింత వన్నె తెచ్చింది.

ఇక లివింగ్ రూమ్ ది మరో ఆకర్షణ. గదిలో ఓ గోడకు సీక్విన్డ్ కుషన్ తో కూడిన ముదురు రంగు సోఫా కనిపిస్తుంది. అలాగే బిపాసా, కరణ్ వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ఆ గదిలో దర్శనమిస్తాయి. చెక్క ఫ్లోరింగ్ పై మెత్తటి లేత గోధుమ రంగు రగ్గు సేద తీరడానికి భలే అనువుగా ఉంటుంది. టీవీ సోఫా సెట్ కు ఎదురుగా ఉంటుంది. తక్కువ ఎత్తులో అమర్చిన చెక్క టేబుల్ పై టీవీని అమర్చారు. అలాగే పక్కనే ఫొటో ఫ్రేములు, చిన్న చిన్న మొక్కలతో కూడిన కుండీలు ఉన్నాయి. టీవీ పక్కనే ఏర్పాటు చేసిన షెల్ఫ్ లలో రంగురంగుల పుస్తకాలు, అందమైన బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఫ్లోర్ టు సీలింగ్ కిటికీలు కనువిందు చేస్తాయి. దీని వల్ల ఇంట్లోకి సూర్మరశ్మి పుష్కంగా వస్తుంది. మొత్తానికి బిపాసా, కరణ్ ఇంట్లో అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి. విశాలమైన టెర్రస్ గార్డెన్ నుంచి పెయింటింగ్ స్టూడియో వరకు.. వంట గది నుంచి లివింగ్ రూమ్ వరకు దేనికదే వైవిధ్యంగా ఉంటుంది.

This website uses cookies.