Categories: TOP STORIES

రియల్ బాటలో బాలీవుడ్.. కారణాలేంటంటే..?

భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అనేది అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తారు. బాలీవుడ్ ప్రమఖులు సైతం ఈ బాటలోనే పయనిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని పలు లగ్జరీ ప్రాజెక్టుల్లో అపార్ట్ మెంట్లు కొనుగోలు చేసినందుకు పలువురు సినీతారలు వార్తల్లోకెక్కారు. బాంద్రా, ఖార్, అంధేరిలోని లోఖండ్‌వాలా, వర్లీ వంటి ప్రాంతాల్లో ఉన్న అనేక భవనాలు సినిమా తారలకు ఇష్టమైన స్థలాలుగా ప్రసిద్ధి చెందాయి. రియల్ ఎస్టేట్‌లో వారంతా పెట్టుబడి పెట్టడానికి ప్రధాన కారణాలు.. అద్దె రాబడి, అంతిమ వినియోగం, భావోద్వేగం.

చాలామంది బాలీవుడ్ తారలు ప్రాజెక్టు ప్రారంభ సమయం లేదా రెడీ టూ మూవ్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడుతున్నారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముంబైలోని ములుండ్ ప్రాంతంలో ఒబెరాయ్ ఎటర్నియా అనే ప్రాజెక్టులో అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ రూ.24.95 కోట్ల విలువైన 10 అపార్ట్ మెంట్లను కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా ఒబెరాయ్ రియల్టీ ప్రాజెక్ట్ వెలుగులోకి వచ్చింది. ఇక ప్రాపర్టీ కొనుగోలు ట్రెండ్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకే పరిమితం కాకుండా ముంబైలోని వాణిజ్య భవనాలకు కూడా వర్తిస్తుంది. ముంబైలోని అంధేరీ ప్రాంతంలోని సిగ్నేచర్ భవనంలో అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అజయ్ దేవగన్ వంటి పలువురు బాలీవుడ్ తారలు వాణిజ్య స్థలాన్ని కలిగి ఉన్నారు.

రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ స్క్వేర్‌యార్డ్స్ సేకరించిన డేటా ప్రకారం, బాలీవుడ్ స్టార్లు రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌ రెండింటినీ ఇష్టపడతారు. సెలబ్రిటీలు తమ పోర్ట్ ఫోలియోలను అసెట్ క్లాస్‌లలో వైవిధ్యపరచడానికి ఇష్టపడుతున్నారు. అలాగే విశ్వసనీయమైన అద్దె రాబడి కోసం ప్రముఖులు కీలకమైన మైక్రో-మార్కెట్లలో బహుళ ప్రాపర్టీలపై దృష్టి సారిస్తుండటంతో వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంది.

2020-2024 మధ్య, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్‌లో రూ.194 కోట్ల పెట్టుబడితో అగ్రస్థానంలో ఉండగా.. జాన్వీ కపూర్ రూ.169 కోట్ల పెట్టుబడితో రెండో స్థానంలో ఉన్నారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే కుటుంబం రియల్ ఎస్టేట్‌లో రూ.156 కోట్లు పెట్టుబడి పెట్టగా.. అజయ్ దేవగన్, కాజోల్ రూ.110 కోట్లు, షాహిద్ కపూర్ రూ.59 కోట్లు పెట్టుబడి పెట్టారు.

భావోద్వేగ పెట్టుబడులు కూడా..

తక్షణ ఉపయోగం కోసం లేదా అద్దె ఆదాయం కోసం రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ పెట్టుబడులు చాలా సాధారణం. కానీ బాలీవుడ్ తారల్లో భావోద్వేగ పెట్టుబడులు కూడా ఉన్నాయ్. ఈ సంవత్సరం ప్రారంభంలో, బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ తన తండ్రి, తల్లి గౌరీ ఖాన్ ఒకప్పుడు నివసించిన దక్షిణ ఢిల్లీలోని అదే భవనంలో రూ.37 కోట్ల విలువైన రెండు అంతస్తులను కొనుగోలు చేశాడు. అక్షయ్ కుమార్ కూడా తన బాల్యంలో నెలకు రూ.500 అద్దె చెల్లించి నివసించిన ఇంటిని త్వరలో కొనుగోలు చేయబోతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఎమోషనల్ కొనుగోళ్ల కోసం భారీ మొత్తం వెచ్చించడానికీ వెనకాడరని ఇండియా సోథెబైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ ఎండీ అమిత్ గోయల్ అన్నారు.

This website uses cookies.