Categories: TOP STORIES

బుద్వేల్ వేలం ఫ్లాప్‌.. ఎందుకంటే?

* ప‌లికిన అత్య‌ధిక ధ‌ర‌.. ఎక‌రానికి 41.25 కోట్లే
* రూ.50 కోట్లు అయినా దాటలేదు
* కోకాపేట్లో స‌గం కూడా ప‌ల‌క‌ని రేటు
* 45.33 ఎక‌రాల‌కు రూ.3319.60 కోట్లు ప‌లికితే
బుద్వేల్‌లో 100 ఎక‌రాల‌కు 3625. 73 కోట్లే
* ఎందుకింత త‌క్కువ రేటు ప‌లికింది?

 

కోకాపేట్‌లో ఎక‌రం వంద కోట్లు ప‌లికితే.. బుద్వేల్‌లో అందులో స‌గ‌మైనా ప‌లుకుతుంద‌ని ఎదురు చూసిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఎక‌రానికి కేవ‌లం రూ.41.25 కోట్లే ప‌లికింది. అంత హాట్ లొకేష‌న్‌లో మ‌రీ ఇంత త‌క్కువ రేటు ఎందుకు ప‌లికిందో హెచ్ఎండీఏ తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాలి. ఎక్క‌డ త‌ప్పులు దొర్లాయ‌నే విష‌యాన్ని ఆరా తీసి వాటిని స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

నిజానికి, కోకాపేట్ కంటే బుద్వేల్ తీసిపోయే ప్రాంతమేమీ కాదు. బుద్వేల్‌లో క‌రెక్టుగా ఆకాశ‌హ‌ర్మ్యాల్ని ప్లాన్ చేస్తే.. ముంబై త‌ర‌హా డెవ‌ల‌ప్ అయ్యేందుకు పూర్తి ఆస్కార‌ముంది. విదేశీ న‌గ‌రాల త‌ర‌హాలో ఆ ఏరియా క‌నిపిస్తుంది. ఈ విష‌యం తెలుగు రాష్ట్రాల బిల్డ‌ర్లంద‌రికీ తెలుసు. ఈ అంశాన్ని గుర్తించి.. కొంద‌రు జాతీయ బిల్డ‌ర్లు సైతం బుద్వేల్ వేలంలో పాల్గొనేందుకు ముందుకొచ్చారు. కాక‌పోతే, ఎందుకో గానీ చివ‌రి ద‌శ‌లో విర‌మించారు. ఎందుకంటే, బుద్వేల్‌లో ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తి రాద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. 30 నుంచి 50 అంత‌స్తుల దాకా నిర్మించ‌లేర‌ని.. సివిల్ ఏవియేష‌న్ అథారిటీ నుంచి ఆకాశ‌హ‌ర్మ్యాల ఎత్తు అనుమ‌తి గురించి హెచ్ఎండీఏ పూర్తి స‌మాచారాన్ని తెలుసుకోకుండానే వేలం పాట‌ల్ని చేప‌ట్టింద‌నే వార్త‌లు వినిపించాయి.

* వేలం వేస్తున్న ప్రాంతంలో మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేయ‌డానికి క‌నీసం ప‌ద్దెనిమిది నెల‌లు ప‌డుతుంది. హైకోర్టులో బుద్వేల్ భూముల‌కు సంబంధించిన కేసు ఉండ‌టం.. చివ‌రి వ‌ర‌కూ ఏం జ‌రుగుతుందోన‌నే ఉత్కంఠ‌ను రేకెత్తించింది. అందుకే, కొంద‌రు బిల్డ‌ర్లు వేలంలో పాల్గొన‌డానికి వెన‌క‌డుగు వేశార‌ని తెలిసింది. ఈ వేలం పాట‌లో పాత బిల్డ‌ర్ల కంటే కొత్తవారే ఎక్కువ‌గా పాల్గొన్నార‌ని స‌మాచారం. ఏదీఏమైనా.. బుద్వేల్‌లో మొద‌టి ద‌శ‌లో వంద ఎక‌రాల్ని వేలం వేస్తే.. ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరింది కేవ‌లం రూ.3625.73 కోట్లే. అదే, కోకాపేట్‌లో 45.33 ఎక‌రాల‌కే రూ.3319.60 కోట్లు వ‌చ్చింది. మ‌రి, బుద్వేల్‌లో అనుకున్న దానికంటే ఎందుకు త‌క్కువ రేటు ప‌లికింద‌నే విష‌యాన్ని హెచ్ఎండీఏ తెలుసుకోవాలి. ఇందుకు గ‌ల కార‌ణాల్ని అన్వేషించాలి. వాటికి ప‌రిష్కారం క‌నుగొనే ప్ర‌య‌త్నం చేయాలి,

This website uses cookies.