Categories: Rera

ధిక్కార కేసులో బిల్డర్ కు 60 రోజుల జైలు

ధిక్కార కేసులో ఓ బిల్డర్ కు 60 రోజుల సాధారణ జైలు శిక్ష పడింది. ఐఎల్డీ బిల్డర్ సల్మాన్ అక్బర్ ను 60 రోజుల పాటు జైలులో ఉంచాలని హర్యానా రెరా ఆదేశించింది. గరీమా గుప్తా వర్సెస్ ఐఎల్డీ మిలీనియం ప్రైవేట్ లిమిటెడ్ కేసులో అడ్జుడికేటింగ్ అధికారి (ఏఓ) రాజేందర్ కుమార్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. ‘సల్మాన్ అక్బర్ ను అదుపులోకి తీసుకుని 60 రోజులు జైలులో ఉంచి, చివరి రోజు ఏఓ ముందు హాజరు పరచాలి’ అని ఉత్తర్వులో పేర్కొన్నారు.

2013 జనవరిలో సెక్టార్ 37లోని ఐఎల్డీ స్పైర్ గ్రీన్స్ లో గరీమా గుప్తా ఓ యూనిట్ బుక్ చేసుకుని ఒప్పందం చేసుకున్నారు. బిల్డర్ 2016 జూలైలో ఆ యూనిట్ ను అప్పగించాల్సి ఉంది. అయితే, నిర్దేశిత గడువులోగా యూనిట్ ను అప్పగించలేదు. దీంతో 2018 నవంబర్ లో గరీమా గుప్తా రెరా కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన రెరా కోర్టు.. గరీమాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

ఆమెకు రూ.27,30,376 తిరిగి చెల్లించాలని ఐఎల్డీ మిలీనియం ప్రైవేటు లిమిటెడ్ ను రెరా కోర్టు ఆదేశించింది. కానీ ఆ ఉత్తర్వులను సంస్థ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సల్మాన్ అక్బర్ ను డిసెంబర్ 21లోగా అరెస్టు చేసి ఏఓ కోర్టు ముందు హాజరు పరచాలని అక్టోబర్ 31న ఆదేశాలు వెలువడ్డాయి. తాజాగా ఆయనకు 60 రోజుల జైలు శిక్ష విధించింది.

This website uses cookies.