కటింగ్, ప్రాసెసింగ్, మన్నిక, వైవిధ్యం, తక్కువ ధర.. వెరసి గ్రానైట్ అనేది రాజస్థాన్ కొత్త మార్బుల్ గా మారింది. కొత్త కటింగ్ టెక్నాలజీ కారణంగా దీని ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల కంటే రాజస్థాన్ ముందంజలో ఉంది. గత ఐదారేళ్లలో కొత్తగా 4 వేల నుంచి 5 వేల కొత్త గ్రానైట్ యూనిట్లు ఆ రాష్ట్రంలో వచ్చాయని అంచనా. అలాగే 2015-16లో 25 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండగా.. 2019-20 నాటికి అది 56 లక్షల టన్నులకు చేరిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గ్రానైట్ మైనింగ్, ప్రాసెసింగ్ పై చాలా మంది దృష్టి పెట్టడంతో కిషన్ గఢ్, జాలోర్, రాజసమండ్ తదితర ప్రాంతాల్లో 4 వేల నుంచి 5వేలకు పైగా కొత్త గ్రానైట్ యూనిట్లు వచ్చాయని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ స్టోన్స్ వైస్ చైర్మన్ రాకేశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. గ్రానైట్ ఉత్పత్తిలో రాజస్తాన్ తెలుగు రాష్ట్రాలను అధిగమించిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గ్రానైట్ ఉత్పత్తిలో రాజస్తాన్ రారాజుగా అవతరించింది.
ఏపీ పునర్విభజన ముందు వరకు గ్రానైట్ ఉత్పత్తిలో మనదే అగ్రస్థానం. అయితే, విభజన తర్వాత రాజస్తాన్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. 2015-16లో రెండు తెలుగు రాష్ట్రాలూ కలిపి 46 లక్షల టన్నుల గ్రానైట్ ఉత్పత్తి చేయగా.. ఆ ఏడాది రాజస్తాన్ 25 లక్షల టన్నుల గ్రానైట్ ఉత్పత్తి చేసింది. ఇక 2019-20కి వచ్చేసరికి రెండు తెలుగు రాష్ట్రాలు 65 లక్షల టన్నుల గ్రానైట్ ఉత్పత్తి చేయగా.. రాజస్తాన్ 56 లక్షట టన్నుల ఉత్పత్తికి చేరింది. 2020-21లో రాజస్తాన్ ఏకంగా 66 లక్షల టన్నులకు చేరుకుంది. కానీ ఈ ఏడాదికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎంత గ్రానైట్ ఉత్పత్తి జరిగిందో వివరాలు వెల్లడి కాలేదు.
అయితే, రాజస్థాన్.. రెండు తెలుగు రాష్ట్రాలను అధిగమించిందని మైనింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ తోపాటు చైనా, బ్రెజిల్ ప్రపంచంలో గ్రానైట్ ఉత్పత్తిదారులుగా కొనసాగుతున్నాయి. అయితే, సాధారణ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తుండటంతో భారత సంప్రదాయ మార్కెట్ లో కొంతభాగం చైనాకు పోతోంది. కానీ, స్వాభావిక లక్షణాల కారణంగా భారత గ్రానైట్ కు మంచి డిమాండ్ ఉంది.
This website uses cookies.