నిర్మాణ పనుల్లో జరిగే ప్రమాదాలకు కాంట్రాక్టర్ తోపాటు బిల్డర్లు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. నిర్మాణ ప్రదేశాల్లో కార్మికుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉంటుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొంటున్నారు. నిర్మాణ పనుల్లో అప్పుడప్పుడూ జరిగే ప్రమాదాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్లను పోలీసులు అరెస్టు చేసినా.. అనంతరం వారు బెయిల్ పై బయటకు వచ్చేస్తారు. కానీ మృతుడి కుటుంబం రోడ్డున పడుతుంది. వారికి పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు.
ఏటా దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్ల నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా వారిపై సరైన చర్యలు ఉండటంలేదు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి మారాలని పలువురు అంటున్నారు. సాధారణంగా పెద్ద పెద్ద బిల్డర్లు తమ నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తుంటారు. ఒకవేళ ఆ సైట్ లో ఏదైనా ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే.. అది తమకు సంబంధం లేదని, కాంట్రాక్టు సంస్థదే బాధ్యత అని తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో పలువురు న్యాయ నిపుణులు దీనిపై స్పందించారు.
నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో కార్మికులకు హెల్మెట్లు, నెట్లు తదితర సురక్షిత పరికరాలను సమకూర్చాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ తోపాటు బిల్డర్ పై కూడా ఉంటుందని స్పష్టంచేశారు. ‘ఇలాంటి కేసుల్లో అటు క్రిమినల్ తోపాటు ఇటు సివిల్ పరంగానూ చర్యలు తీసుకోవాలి. సురక్షిత ప్రమాణాలు పాటించనందున కాంట్రాక్టర్ తోపాటు బిల్డర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలి. అలాగే నిర్మాణ ప్రదేశాల్లో సురక్షిత చర్యలు చేపట్టారా లేదా అనే అంశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లను కూడా విచారించాలి’ అని ముంబైకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, లాయర్, సామాజిక కార్యకర్త వైపీ సింగ్ అభిప్రాయపడ్డారు.
కార్మికుల పరిహారం చట్టం 1923 ప్రకారం భవన నిర్మాణానికి అనుమతి తీసుకునేటప్పుడే జనతా బీమా పాలసీ కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. ‘ఒకవేళ బీమా పాలసీ ఉంటే, పరిహారాన్ని ఆ సంస్థే చెల్లిస్తుంది. ఒకవేళ బీమా పాలసీ లేకుంటే, భవన అనుమతి రద్దు చేయాలి. బిల్డర్ తగిన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు తిరిగి మొదలుపెట్టాలి’ అని వివరించారు.
This website uses cookies.