బిల్డాక్స్ విషయంలో కట్టుదిట్టమైన విచారణ జరిపి తగిన చర్యల్ని తీసుకుంటామని టీఎస్ రెరా తెలియజేసింది. ఈ మేరకు సోమవారం టీఎస్ రెరా కార్యదర్శి పి. యాదిరెడ్డి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రెండు రోజుల క్రితం రెజ్ న్యూస్ టీఎస్ రెరాను సీఎం ప్రక్షాళన చేయాలి అనే కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై టీఎస్ రెరా స్పందిస్తూ సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ పలు అంశాలపై టీఎస్ రెరా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొండాపూర్‌లోని బిల్డాక్స్ ప్రీలాంచ్ వ్యవహారం ఇంకా రెరా ట్రిబ్యునల్ పరిధిలోనే ఉందని.. ఏప్రిల్ నాలుగో తేదిన మరోసారి బిల్డాక్స్‌పై విచారణ జరుపుతామని తాజా ప్రకటనలో పేర్కొంది. బిల్డాక్స్ పై ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో నోటీసులు జారీ చేశామని, సమాధానం సంతృప్తికరంగా లేనందు వల్ల మూడో విడత షోకాజ్ నోటీసునిచ్చామని టీఎస్ రెరా తాజాగా తెలియజేసింది. ఈ సంస్థకు ఇతర ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేనందు వల్ల ఆయా ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ప్రీ లాంచులతో పాటు రెరా నిబంధనల్ని ఉల్లంఘించిన 27 ప్రాజెక్టులకు నోటీసులు జారీ చేసి.. సుమారు రూ. 21 కోట్ల మేరకు అపరాధ రుసుము విధించామని ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు రెరాలో రిజిస్ట్రేషన్ కోసం 9217 ప్రాజెక్టులు దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి 8003 ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు అథారిటీ తెలిపింది. అదేవిధంగా 3765 మంది ఏజెంట్లు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, 3621 మంది ఏజెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
రెరాలో దరఖాస్తు చేసిన వెంటనే అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి చట్టపరంగా 30 రోజుల సమయం ఉన్నప్పటికీ సక్రమంగా ఉన్న ప్రాజెక్టులకు వారం, పది రోజులలో నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆన్లైన్ లోనే అనుమతులు జారీ చేస్తున్నట్లు అథారిటీ తెలిపింది. రెరా జారీ చేసిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రిబ్యునల్, పిదప గౌరవ హైకోర్టు, సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేసుకునే అవకాశాలు ఉంటాయని తెలిపింది. ముగ్గురు సభ్యులతో కూడిన అథారిటీ బెంచ్ (చైర్మన్ మరియు ఇద్దరు సభ్యులు) ఫిర్యాదులపై విచారణ జరిపి నిజ నిర్ధారణకు త్వరితగతిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అథారిటీ తెలిపింది.
This website uses cookies.