టాప్ ఫ్లోరులో నివసించాలన్నది మీ లక్ష్యమా? అందరి కంటే ఎత్తయిన ప్రదేశంలో ఫ్లాటు ఉండాలని కలలు కంటున్నారా? మీరెంతో ముచ్చటపడి ఫ్లాట్ కొన్నాక.. పగుళ్లు మిమ్మల్ని పరిష్కరిస్తే.. లీకేజీలు మీకు స్వాగతం చెబితే.. అలాంటి అనుభవం వద్దనుకుంటే.. కచ్చితంగా మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
అపరిమిత ఎఫ్ఎస్ఐ (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్).. ఎంతెత్తుకెళ్లినా సెట్ బ్యాక్స్ వదలక్కర్లేదు.. ఇంకేముంది.. ఒక్కసారిగా స్థలయజమానుల్లో అత్యాశ పెరిగింది.. గొంతెమ్మ కోరికలు కోరడం ఆరంభించారు. వాటిని తీర్చలేనివారు నెమ్మదిగా పక్కకు జరిగిపోతున్నారు. దీంతో, ఊరూ పేరూ లేనోళ్లంతా 30, 40 అంతస్తులు కడతామంటూ ముందుకొస్తున్నారు. ల్యాండ్ లార్డులకు అడ్వాన్స్ కట్టేసి.. బయ్యర్ల నుంచి ముందే వంద శాతం సొమ్ము లాగేసుకుంటున్నారు.. నాలుగైదేళ్లు వేచి చూస్తే ఫ్లాట్ వస్తుందంటూ కలలు కనడాన్ని అలవాటు చేసుకున్నారు. ఇదిగో.. ఇలాగే ఆలోచించి.. ఢిల్లీలోని నొయిడా, గుర్గావ్‌లో పది, పదిహేనేళ్లయినా.. ఫ్లాట్లు చేతికి రాక.. బయ్యర్లు నేటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
కాబట్టి, ప్రీలాంచ్ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొత్త బిల్డర్ల వద్ద కొనకపోవడమే మంచిది. కాస్త పేరున్న బిల్డర్ అయితే, నిర్మాణ నాణ్యతను పాటిస్తారా? లేదా? అనే అంశాన్ని పక్కాగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో పేరెన్నిక గల బిల్డర్ అయినా పై అంతస్తుల్లో కట్టే ఫ్లాట్లను నాణ్యతగా కట్టకపోవచ్చు. కాబట్టి, నాణ్యత విషయంలో పూర్తిగా తెలుసుకున్నాకే అడుగు ముందుకు వేయాలి.