మూడు, నాలుగేళ్ల క్రితం.. తెల్లాపూర్, కొల్లూరు, వెలిమల, మోకిలా వంటి ప్రాంతాల్లో విల్లాల రేట్లు తక్కువే ఉండేవి. మహా అయితే కోటీ, కోటీన్నరకు విల్లా వచ్చేది. కానీ, కరోనా సమయంతో సంబంధం లేకుండా ఆయా ప్రాంతాల్లో విల్లాల రేట్లు ఒక్కసారిగా మూడు నుంచి నాలుగు కోట్లకు చేరుకున్నాయి. అసలెందుకు అంతగా రేట్లు పెరిగాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో.. అప్పట్లో తక్కువ రేటుకు విల్లాలు కొన్నవారు.. వాటిని అమ్మకానికి పెట్టారు. అంటే, విల్లాలను రీసేల్ చేయడానికి సంసిద్ధులయ్యారు. కాకపోతే, మార్కెట్లో అంతంత రేటు పెట్టి కొనడానికి బయ్యర్లు పెద్దగా ముందకు రావట్లేదు. రీసేల్ విల్లాల్ని కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపెట్టడం లేదు. కారణం..
నేటికీ కొల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కోటీన్నర రూపాయలకే కొందరు డెవలపర్లు విల్లాల్ని విక్రయిస్తున్నారు. అవి మహా అయితే ఒకట్రెండేళ్లలో పూర్తవుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. బయ్యర్లు అధిక రేటు పెట్టి రీసేల్ విల్లాల్ని కొనడానికి ఇష్టపడట్లేదు. రేటు తక్కువున్న చోటే కొనేందుకు ముందుకొస్తున్నారు. అందుకే, గత కొంతకాలం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో హై ఎండ్ విల్లాలకు రీసేల్ పెద్దగా జరగట్లేదు.
ప్రధానంగా, నివాసయోగ్యంగా లేని ప్రాంతాల్లో నివసించడానికి బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపెట్టడం లేదు. ఇప్పటికే మంచిరేవుల వంటి ఏరియాల్లో విల్లాలు కొన్నవారు తెగ ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరాల్లో ఆస్పత్రికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. సినిమాలకు వెళ్లాలన్నా.. షికార్లకు వెళ్లాలన్నా.. గచ్చిబౌలి వరకూ వెళ్లాల్సి వస్తోంది. కొల్లూరు, వెలిమలలో కొనేవారిదీ ఇదే దుస్థితి. ఇలాంటి ప్రతికూలాంశాల కారణంగా.. అనేక మంది రీసేల్ ప్లాట్లను కొనడానికి ముందుకు రావట్లేదు.
* ఒకవేళ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులో విల్లా కొంటే.. వచ్చే రెండేళ్లలో ఆయా ప్రాంతంలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. అందుకే, అనేక మంది రీసేల్ విల్లాల బదులు తక్కువ రేటుకొచ్చే కొత్త విల్లాలే కొంటున్నారు.