ముంబైకి చెందిన గోద్రెజ్ ప్రాపర్టీస్, బెంగళూరుకు చెందిన బ్రిగ్రేడ్ గ్రూప్, ప్రెస్టీజ్ గ్రూప్ వంటి సంస్థలతో పాటు కొందరు స్థానిక బిల్డర్లు.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) పేరిట ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీరు తెలివిగా ఏం చేస్తున్నారంటే.. ఛానెల్ పార్ట్‌నర్ల ద్వారా ఈ తతంగాన్ని నడిపిస్తూ.. తమ చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడుతున్నారు. మరి, తమ అనుమతి లేకుండా ఫ్లాట్లను విక్రయించకూడదని చెబుతున్న టీజీ రెరా.. ఈఓఐ పేరిట కొందరు బిల్డర్లు ఫ్లాట్లను విక్రయిస్తుంటే ఏం చేస్తోంది? రెరా నిబంధనల ప్రకారం, ఏ బిల్డర్ అయినా ఇలా ఫ్లాట్లను విక్రయించొచ్చా? లేకపోతే, కొందరు బిల్డర్లకు ఇలాంటి స్పెషల్ ప్రివిలేజ్‌ను టీజీ రెరా కల్పించిందా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని టీజీ రెరా శాఖ దీనిపై స్పందించాలి.
రెరా నిబంధనల ప్రకారం.. టీజీ రెరా అనుమతి లేకుండా ఏ బిల్డర్ ఫ్లాట్లను విక్రయించకూడదు. కాకపోతే, కొందరు స్థానిక బిల్డర్లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిర్మాణ సంస్థలు.. హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ఛానెల్ పార్ట్‌నర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. మరి, రెరా నిబంధనలకు విరుద్ధంగా నగరంలో జరుగుతోన్న ఈ అక్రమ అమ్మకాల తతంగాన్ని టీజీ రెరా నియంత్రించడంలో ఎందుకు విఫలం అవుతోంది? టీజీ రెరా వద్ద నమోదైన ఏజెంట్లు, ఛానెల్ పార్ట్‌నర్లపై ఈఓఐ పేరుతో బుకింగులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోతుంది? కేవలం చెక్కులు తీసుకుంటున్నాం.. రెరా వచ్చాకే బ్యాంకులో వాటిని సమర్పిస్తామని కొందరు బాహాటంగా సమర్థించుకుంటున్నారు. మరి, ఇలా వ్యవహరించడం కరెక్టేనా? ఈ విషయంలో టీజీ రెరా అథారిటీ స్పష్టతనివ్వాలి. ఒకవేళ ఈఓఐ పేరుతో ఫ్లాట్లను విక్రయించవచ్చని టీజీ రెరా స్పష్టతనిస్తే.. అదే నిబంధనను బిల్డర్లందరూ అనుసరిస్తారు కదా. కాబట్టి, సీఎం రేవంత్ రెడ్డి టీజీ రెరా గురించి క్లారిటీనివ్వాలి.
This website uses cookies.