Categories: LATEST UPDATES

విశాఖకు రాజధాని..  విజయవాడకు కష్టాలు

కోలుకుంటున్న అమరావతికి మళ్లీ రియల్ కష్టాలు
విశాఖకు రాజధాని తరలింపు ఖాయమన్న ప్రకటనతో ఇబ్బందులు
ఇప్పుడిప్పుడే కాస్త గాడిన పడుతున్న అమరావతి రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ కుదుపునకు గురైంది. ఏపీ రాజధాని విశాఖపట్నానికి మారడం ఖాయమన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రకటనతో అనిశ్చితిలో పడింది. ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినవారు ఆందోళనకు గురవుతున్నారు. శివారు ప్రాంతాల్లో పెద్ద పెద్ద వెంచర్లు వేసినవారంతా తమ పరిస్థితి ఏమవుతుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీకి మూడు రాజధానులు తీసుకొస్తామంటూ వైఎస్సార్ సీపీ సర్కారు 2019లో ప్రకటన చేయడంతో అమరావతి రియల్ రంగం తీవ్ర ఒడుదొడుకులకు గురైంది. అదే సమయంలో అమరావతిలో రాజధాని నిర్మాణం సైతం ఆగిపోవడంతో అక్కడి రియల్ కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో వందలాది ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉండిపోయాయి. మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతుల నిరసనలు స్థిరాస్తి రంగంపై మరింత ప్రభావం చూపించాయి. అయితే, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రాజధాని నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మళ్లీ కాస్త ఆశలు చిగురింపజేశాయి. దీంతో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు మళ్లీ ప్రాజెక్టులు ప్రారంభించాయి.
* విజయవాడ పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాయి. ప్రీమియం విల్లాలు, ఫ్లాట్లు, హౌసింగ్ లేఔట్లతో అమరావతి రియల్ రంగం గాడిన పడుతూ వస్తోంది. ప్రజల నుంచి కూడా ఆయా ప్రాజెక్టులకు మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాలకు చెందినవారు ఆయా ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటన వారిలో అయోమయం కలిగించింది. దీంతో ఫ్లాట్ల కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించి ఒప్పందం చేసుకున్నవారంతా వాటిని రద్దు చేసుకుంటున్నారు. తాము కట్టిన మొత్తం వెనక్కి ఇచ్చేయాలని బిల్డర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ‘మా భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఏపీసీఆర్డీఏ నుంచి అనుమతులు పొంది భారీ పెట్టుబడులు పెట్టి వెంచర్లు వేశాం. కానీ పరిస్థితి ఇప్పుడు ఇలా మారిపోయింది. మేం దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాం’ అని ఓ రియల్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

This website uses cookies.