Categories: LATEST UPDATES

రూ. 50వేల కోట్ల పెట్టుబడులు..  4 లక్షల ఉద్యోగాలు

వచ్చే ఐదేళ్లలో రానున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటన

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఆవిష్కరణ

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తద్వారా తెలంగాణలో దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ లో భాగంగా రాష్ట్రంలో మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. టీఎంవీలో హైదరాబాద్ లో నాలుగు మెగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జహీరాబాద్, సీతారాంపూర్ ల లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ క్లస్టర్, ఎన్కతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నట్టు కేటీఆర్ వివరించారు. త్వరలోనే రాష్ట్రానికి రూ.3వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్టు తెలిపారు.
ఈ పెట్టుబడులు తెలంగాణలో ఎలక్ట్రిక్ 2 వీలర్, 3 వీలర్, చార్జింగ్ పరికరాల తయారీకి ఎకో సిస్టమ్స్ ను బలోపేతం చేస్తాయని వెల్లడించారు. అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, ఆటో ఇంజనీరింగ్ లో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ రంగాల్లో ఆయా కంపెనీల కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పనిచేస్తుందని చెప్పారు. ఈ రంగంలోని నిపుణులు, గ్లోబల్ ఆటోమోటివ్ ఎకో సిస్టమ్ భాగస్వాములను ఒక వేదికపై తీసుకురావడానికి హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ ను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

This website uses cookies.