Categories: LATEST UPDATES

ఐదేళ్ల గరిష్ట స్థాయికి పారిశ్రామిక లీజింగ్

  • ఈ ఏడాది చివరికి 36 నుంచి 38 మిలియన్
    చదరపు అడుగులకు చేరే చాన్స్
  • సీబీఆర్ఈ నివేదిక వెల్లడి

దేశంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగం ఈ ఏడాది మరింత దూకుడు ప్రదర్శిస్తుందని, ఐదేళ్ల గరిష్ట స్థాయిని చేరుకుంటుందని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. 2023లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగం లీజింగ్ 36 నుంచి 38 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. సరఫరా కూడా 35 నుంచి 37 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోవచ్చని తెలిపింది.

2023 జనవరి-సెప్టెంబర్ లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ లీజింగ్ వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరుగుదల నమోదైందని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. 2022 జనవరి-సెప్టెంబర్ లో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 24.2 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. 2023 జనవరి-సెప్టెంబర్ లో 27.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైనట్టు వివరించింది. ఇందులో ముంబై, చెన్నై, ఢిల్లీ కలిసి 56 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇక థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్లేయర్లు 45 శాతం వాటాతో లీజింగ్ లో ఆధిపత్యం చెలాయించగా.. ఇంజనీరింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు 15 శాతం, ఆటో, అనుబంధ రంగాలు 7 శాతం, ఎఫ్ఎంసీజీ 6 శాతం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ 5 శాతం వాటా కలిగి ఉన్నాయి. అలాగే సరఫరా 57 శాతం పెరిగి 28 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. సరఫరాలో ఢిల్లీ, చెన్నై, కోల్ కతా కలిసి 56 శాతం వాటా కలిగి ఉన్నాయి.

నగరాల వారీగా చూస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చెన్నైలో అత్యధికంగా 2.1 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. తర్వాతి స్థానాల్లో 1.7 మిలియన్ చదరపు అడుగులతో బెంగళూరు, 1.3 మిలియన్ చదరపు అడుగులతో ముంబై ఉన్నాయి. క్యూ3లో లీజింగ్ లో ఈ మూడు నగరాల వాటా 62 శాతంగా ఉంది. అలాగే ఈ త్రైమాసికంలో 3పీఎల్ ప్లేయర్లు లీజింగ్ కార్యకలాపాల్లో అత్యధికంగా 50 శాతం వాటా కలిగి ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ 13 వాతం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కంపెనీలు 8 శాతంతో ఉన్నాయి.

లీజింగ్ కార్యకలాపాల్లో దేశీయ కార్పొరేషన్లు 59 శాతం వాటా కలిగి ఉండగా.. ఈఎంఈఏ కార్పొరేషన్లు 25 శాతం, ఏపీఏసీ కార్పొరేషన్లు 12 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన మార్పు కనపడుతోందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మ్యాగజైన్ పేర్కొన్నారు. 2023 చివరి నాటికి ఈ లీజింగ్ కార్యకలాపాలు 36 నుంచి 38 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు.

This website uses cookies.