బాలీవుడ్ నటి, సారా అలీఖాన్ తల్లి అమృతా సింగ్ ముంబైలోని జుహూలో ఓ అపార్ట్ మెంట్ కొన్నారు. 2260 చదరపు అడుగుల రెడీ టూ మూవ్ లగ్జరీ అపార్ట్ మెంట్ ను ఆమె రూ.18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ ఫ్లాట్ జుహూ విలే పార్లేలోని జేవీపీడీ స్కీమ్ ప్రాంతంలో నూతన్ లక్ష్మీ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నాలుగో అంతస్తులో ఉంది. ఫిబ్రవరి 14న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.90 లక్షల స్టాంపు డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. చదరపు అడుగుకు రూ.66,350 ధర పలికినట్టయింది. ఈ కొనుగోలు కింద రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వచ్చాయి.
వైశాలి శ్రీకాంత్ భట్, శ్రీకాంత్ శ్రీనివాస్ భట్ నుంచి ఆమె ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. కాగా, ముంబైలోని జుహూ చాలా కీలకమైన ప్రాంతం. వరుణ్ ధావన్, అమితాబ్ బచ్చన్ వంటి అనేకమంది బాలీవుడ్ తారలు, చిత్ర నిర్మాతలు, దర్శకులు ఇక్కడ నివసిస్తున్నారు. సముద్రానికి అభిముఖంగా బోలెడు అపార్ట్ మెంట్లు, బంగ్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని అపార్ట్ మెంట్‌ల ధర చదరపు అడుగుకు రూ.50వేల నుంచి రూ.80వేల మధ్య ఉంటుంది. ఇటీవల, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, ఆయన కుటుంబం జనవరిలో ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.86.92 కోట్ల విలువైన రెండు లగ్జరీ అపార్ట్ మెంట్లు కొనుగోలు చేశారు.