Categories: LATEST UPDATES

ఇల్లు కొనేటప్పుడు ఇవి చూసుకోండి..

ఇల్లు కొనడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇల్లు కొనేటప్పుడు కొన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

ధర ట్రెండ్ తెలుసుకోవాలి..

మీరు ఎంచుకున్న ఇంటి ధర ఎలా ఉంది అనే విషయం చాలా కీలకం. అమ్మకందారు చెబుతున్న ధర సరైనదేనా? ఆ ప్రాంతంలో అలాంటి ఇంటికి ఆ ధర సహేతుకమేనా అన్న విషయం నిర్ధారించుకోవాలి. ఇందుకోసం అక్కడి ధరల ట్రెండ్ ఎలా ఉందో పరిశీలించాలి. స్థానికంగా విచారణ జరపడంతోపాటు ఆన్ లైన్ సాధనాల ద్వారా అక్కడి పరిస్థితులు, ధరల ట్రెండ్ ఎలా ఉంది అనే విషయం ముందుగానే క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల ఇంటి ధరకు సంబంధించి అమ్మకందారుతో చర్చలు జరిపి బేరం ఆడటానికి అవకాశం ఉంటుంది. తద్వారా బోలెడు డబ్బు ఆదా చేసుకోవచ్చు.

బ్రోకరేజిపై పొదుపు..

రియల్ ఎస్టేట్ రంగంలో మధ్యవర్తులు, బ్రోకర్ల పాత్ర ఎక్కువగానే ఉంటుంది. ఇది ఒక్కోసారి ఇంటి కొనుగోలు ప్రక్రియ క్లిష్టంగా మారడానికి అదనపు వ్యయం కావడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రాప్ టెక్ ఫ్లాట్ ఫామ్ లు ఈ బాధను కాస్త తొలగించాయి. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య సంప్రదింపులు నేరుగా కొనసాగేలా చేశాయి. ఈ ప్లాట్ ఫారమ్ ల సాయంతో మీ ప్ర్రాధాన్యతలు, బడ్జెట్ కు అనుగుణంగా కొత్త ఇంటిని ఎంపిక చేసుకునే వీలుంది. ఎలాంటి బ్రోకరేజి రుసుము లేకుండా ప్రాపర్టీ అమ్మకందారులను సంప్రదించవచ్చు.

దశలవారీగా ఫర్నిషింగ్..

ఇల్లు కొనడం ఒక ఎత్తైతే.. దానిని అందంగా అలంకరించుకోవడం మరో ఎత్తు. ఇంటి ఫర్నిషింగ్ కు సైతం ఎక్కువ వ్యయమే అవుతుంది. ఇల్లు కొన్న వెంటనే ఫర్నిషింగ్ చేయించుకోవడం కొందరి బడ్జెట్ కు కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో దశలవారీగా ఫర్నిషింగ్ చేయించుకోవడం ఉత్తమం. ప్రాధాన్యతా క్రమంలో ఫర్నిషింగ్ చేయించుకోవాలి. ముందుగా కిచెన్ స్లాబ్ లు, అల్మారాల వంటి ప్రాథమిక అంశాలతో ప్రారంభించాలి. అనంతరం నెమ్మదిగా సోఫా సెట్ల వంటి ఇతర వస్తువులు జోడించుకోవచ్చు. ఆపై పెయింటింగ్, కళాఖండాల వంటి అలంకరణ వస్తువులపై దృష్టి పెట్టొచ్చు.

ఇల్లు కొనే సమయం ఎంపికా కీలకమే..

ఇల్లు కొనే విషయంలో ఎవరూ అంతగా పట్టించుకోని అంశం సమయం. నిర్దిష్ట సీజన్లు లేదా దసరా, దీపావళి వంటి పండగ సమయాల్లో కొనుగోలుదారులను ఆకర్షించడానికి విక్రేతలు బోలెడు ప్రయత్నాలు చేస్తారు. ఆకర్షణీయ ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తుంటారు. ధర తగ్గింపులు, సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు, అదనపు సౌకర్యాలు లేదా ఉచిత ఫర్నిషింగ్ వంటి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తారు. అందువల్ల ఇలాంటి సమయంలో ఇల్లు కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అయ్యే అవకాశం ఉంది.

This website uses cookies.