Categories: LATEST UPDATES

భారీ విస్తరణ దిశగా రిటైల్ మాల్స్

  • రూ.20వేల కోట్లతో కొత్తగా
    35 మిలియన్ చ.అ. స్థలం

దేశంలో రిటైల్ మాల్స్ భారీగా విస్తరించనున్నాయి. వచ్చే మూడు నాలుగేళ్లలో రూ.20వేల కోట్ల వ్యయంతో 35 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అమ్మకాలు బాగా పుంజుకోవడంతో రిటైల్ మాల్స్ ను విస్తరించాలని సంబంధిత ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. 17 నగరాల్లోని 28 మాల్స్‌ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపుదిద్దుకుంది.

‘రిటైల్ మాల్ ఆపరేటర్ల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థలంలో మూడింట ఒక వంతు కొత్తగా రానుంది. ఇందులో ద్వితీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మాల్స్‌ ఆదాయం మహమ్మారి ముందస్తు కాలంతో పోలిస్తే 125 శాతం ఉండనుంది’ అని నివేదిక వివరించింది. ‘మాల్స్ లో పెట్టుబ‌డులకు పెట్టుబడిదారులకు ఆసక్తి ఉంది. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొంది. ప్రైవేట్‌ ఈక్విటీ, గ్లోబల్‌ పెన్షన్‌ ఫండ్స్‌, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ నుంచి 15-20 శాతం నిధులు వచ్చే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 60 శాతం వృద్ధిని సాధించిన తరువాత మాల్ యజమానులు 2023-24లో 7-9 శాతం ఆదాయ వృద్ధితో వరుసగా రెండవ సంవత్సరం అధిక పనితీరును కనబరిచే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.

This website uses cookies.