Categories: LATEST UPDATES

చైనా సంక్షోభం.. భారత్ కు లాభమా?

కోవిడ్ మహమ్మారి కారణంగా చైనా విధించిన లాక్ డౌన్ లు ఆ దేశ ఉత్పత్తి రంగంపై తీవ్రంగా ప్రభావం చూపించాయి. దీంతో డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితి భారత్ తనను తాను అంతర్జాతీయ తయారీ హబ్ గా నిరూపించుకునే అవకాశం కల్పించిందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి 2001లో చైనా ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరిన తర్వాత ముందుకు దూసుకెళ్లింది. ఓ దశలో అమెరికా ఆర్థిక వ్యవస్థను సైతం దాటేసింది. ఏపిల్, టెస్లా వంటి కంపెనీలు సైతం చైనాలో ఫ్యాక్టరీలు తెరిచాయి.

2001 నుంచి 2021 మధ్య కాలంలో చైనా ఎగుమతులు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. అదే సమయంలో అమెరికా ఎగుమతులు 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా చైనా ఉత్పాదక రంగం ఒడుదొడుకులకు లోనైంది. ఉత్పత్తి నిలిచిపోవడంతో ఎగుమతులపై ప్రభావం పడింది. ఒక విధంగా చైనా సంక్షోభం భారత్ పై కూడా ప్రభావం చూపించింది. గత కొన్నేళ్లుగా భారత్ తో చైనా వాణిజ్య కార్యకలాపాలు బాగా పెరిగాయి. 2020-21లో చైనా నుంచి భారత్ కు 16.6 శాతం ఎగుమతులు వచ్చాయి. ఇది 2013-14లో ఇది 10.7 శాతంగా ఉంది. అలాగే ఇదే సమయంలో భారత్ నుంచి చైనాకు ఎగుమతులు 6.4 శాతం నుంచి 7.24 శాతానికి పెరిగాయి.

కెమికల్స్, మినరల్ ఫ్యూయల్స్ తదితరాలను చైనాకు ఎగుమతి చేస్తున్నాం. ఇక చైనా నుంచి ఎలక్ట్రికల్ మెషినరీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ తదితరాలను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల చైనా సంక్షోభం భారత వాణిజ్యంపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తనకు అవసరమైన వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చైనా పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో భారత్ తన తయారీ సామర్థ్యాన్ని బాగా పెంచుకోవాలి. ఫలితంగా అంతర్జాతీయ పెట్టుబడి అవకాశాలను భారత్ ఆకర్షించే అవకాశం కలుగుతుందని అంటున్నారు.

This website uses cookies.