Categories: LATEST UPDATES

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కో-డెవలపర్ పాలసీ..

నిధులలేమి కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడానికి కో-డెవలపర్ పాలసీ తీసుకురావడమే సరైన మార్గమని అధికార వర్గాలు యోచిస్తున్నాయి. ఈ మేరకు ఆయా ప్రాజెక్టుల్లోకి కంపెనీలను అనుమతించాలని నోయిడా, గ్రేటర్ నోయిడా అధికారులు నిర్ణయించారు. ఈ విధానం కింద కొత్త కంపెనీలు ప్రాజెక్టుల్లోకి నిధులు తీసుకొచ్చి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే దాదాపు రూ.40వేల కోట్ల మేర భూ బకాయిలను కొత్త కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇళ్ల కొనుగోలుదారులు లబ్ధి పొందుతారు. కో-డెవలపర్ పాలసీని క్రెడాయ్ ఇండియా ప్రతిపాదించిందని నోయిడా, గ్రేటర్ నోయిడా అథార్టీ సీఈఓ రీతూ మహేశ్వరి వెల్లడించారు. అధికారులు కో-డెవలపర్ పాలసీ సహా కొన్ని పాలసీలపై పని చేస్తున్నారని చెప్పారు. బకాయిలను ఎవరు చెల్లించగలుగుతారో వారికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కాగా, వాస్తవానికి కో-డెవలపర్ పాలసీని తొలుత 2017లోనే తీసుకొచ్చారు. కానీ భూ బకాయిల కారణంగా అప్పట్లో ఇది విఫలమైంది. ఈ నేపథ్యంలో భూ బకాయిల విషయంలో నిబంధనలను సరళతరం చేసి కో-డెవలపర్ పాలసీ తీసుకురావాలని క్రెడాయ్ ఎన్సీఆర్ ప్రతిపాదించింది.

This website uses cookies.